తాజావార్తలు

ATM PIN హిస్టరీ ..! ఆ క్రియేటర్‌‌కు దక్కిన అవార్డు ఎంతో తెలిస్తే అంత తక్కువా అనుకుంటారు

ATM PIN హిస్టరీ ..! ఆ క్రియేటర్‌‌కు దక్కిన అవార్డు ఎంతో తెలిస్తే అంత తక్కువా అనుకుంటారు


బ్యాంకింగ్ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన ఏటీఎం పిన్ వ్యవస్థ, నేడు కోట్లాది మందికి భద్రతను ఇస్తోంది. కానీ ఈ సాంకేతికతను కనుగొన్న జేమ్స్ గుడ్‌ఫెలోకు అప్పట్లో లభించిన బహుమతి కేవలం పది పౌండ్లు మాత్రమే! అసలు ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న కథాకమీమామిషు ఏమిటి? ఏటీఎం భద్రతకు పునాది వేసిన ఆ మేధావి ప్రస్థానం ఏమిటో తెలుసుకుందాం.

నేటి డిజిటల్ కాలంలో మనకు ఏటీఎం పిన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జేబులో పర్సు లేకపోయినా, చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు మరియు నాలుగు అంకెల రహస్య కోడ్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడి నుండైనా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా, మన డబ్బుకు కొండంత భద్రతను ఇచ్చే ఈ ‘ఏటీఎం పిన్’ వ్యవస్థ వెనుక ఒక ఆసక్తికరమైన, మరెంతో ఆశ్చర్యకరమైన చరిత్ర దాగుంది. కోట్లాది రూపాయల లావాదేవీలను కాపలా కాసే ఈ అద్భుత సాంకేతికతను కనిపెట్టిన మేధావికి అప్పట్లో దక్కిన పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే.

విప్లవాత్మక ఆవిష్కరణ

1960ల కాలంలో బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. ఆ సమయంలో స్కాట్లాండ్‌కు చెందిన ఇంజనీర్ జేమ్స్ గుడ్‌ఫెలో, మానవ ప్రమేయం లేకుండా యంత్రం ద్వారా నగదును విత్‌డ్రా చేసేందుకు అవసరమైన ‘పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్’ (PIN) సాంకేతికతను 1966లో అభివృద్ధి చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఏటీఎంలు ఈ భద్రతా సూత్రంపైనే పనిచేస్తున్నాయి.

ఇంతటి విప్లవాత్మక ఆవిష్కరణ చేసినందుకు ఆయన పనిచేస్తున్న సంస్థ అందించిన బహుమతి కేవలం 10 పౌండ్లు మాత్రమే! ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఇది వెయ్యి రూపాయల లోపే ఉండటం గమనార్హం. “ఆవిష్కరణ నాదే అయినా, సంస్థ నిబంధనల ప్రకారం నాకు దక్కిన బోనస్ పది పౌండ్లు మాత్రమే” అని ఆయన తర్వాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఆధునిక బ్యాంకింగ్‌కు..

జేమ్స్ గుడ్‌ఫెలో ఈ సాంకేతికతను రూపొందించిన మరుసటి సంవత్సరమే, 1967లో లండన్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు పంపిణీ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. 1973లో ఈ వ్యవస్థకు అమెరికాలో పేటెంట్ లభించడంతో ఆధునిక ఏటీఎంల యుగం మొదలైంది. తప్పుడు పిన్ వరుసగా మూడుసార్లు నమోదు చేస్తే కార్డు బ్లాక్ అయ్యే భద్రతా వ్యవస్థకు ఆనాటి మేధస్సే పునాది.

ఏటీఎం సెంటర్ల భద్రతా వలయానికి పునాది వేసిన ఈ 10 పౌండ్ల ఆవిష్కరణ, నేటి ఆర్థిక రంగాన్ని డిజిటల్ వైపు నడిపించింది. ఆ స్కాటిష్ మేధావి సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం, 2006లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ (OBE) గౌరవాన్ని అందించి సత్కరించింది. పారితోషికం చిన్నదైనా, ఆయన ప్రపంచానికి అందించిన ఈ సాంకేతికత మాత్రం అమూల్యమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *