కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల తొలగింపులు, కాస్ట్ కట్టింగ్ విధానాలు సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో, కొందరు యజమానులు తమ సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా చండీగఢ్‌కు చెందిన ఒక ఫార్మా కంపెనీ సీఈఓ తన ఉద్యోగుల పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ కానుకలను అందజేశారు. మిట్స్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన ఎంకే భాటియా, తమ సంస్థలో విధేయతతో కష్టపడి పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు సరికొత్త కియా సోనెట్ ఎస్‌యూవీ కార్లను దీపావళి బోనస్‌గా బహుమతిగా ఇచ్చారు.
వరుసగా నాలుగో ఏడాది కూడా..
ఉద్యోగులకు కార్లను కానుకగా ఇవ్వడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదు. గత నాలుగేళ్లుగా ఇదే సంప్రదాయాన్ని భాటియా కొనసాగిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ఏకంగా 51 మంది ఉద్యోగులకు కార్లను కానుకగా ఇవ్వగా, క్రిస్మస్ పండుగ సమయంలోనూ మరో కొన్ని వాహనాలను బహుకరించారు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసి, షోరూమ్‌లోనే స్వయంగా కార్ల తాళాలను అందజేశారు. ఉద్యోగులు కార్లను ఆవిష్కరించే సమయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
వినూత్నమైన కార్ల పథకం
ఈ కంపెనీ అమలు చేస్తున్న కార్ల పథకం చాలా ప్రత్యేకమైనది. కంపెనీలో ఐదేళ్లకు పైగా సేవలందించిన విశ్వసనీయ ఉద్యోగులను ఈ కానుకల కోసం ఎంపిక చేస్తారు. వాహన ధరకు సంబంధించిన 30శాతం డౌన్ పేమెంట్‌ను కంపెనీ భరిస్తుంది. అలాగే ఉద్యోగి జీతంతో పాటు ఈఎంఐ చెల్లింపులకు కూడా కంపెనీ సహకరిస్తుంది. అంతేకాకుండా, కొత్తగా చేరిన సిబ్బంది కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహించి వారిలో ఒకరికి కారును గెలుచుకునే అదృష్టాన్ని కల్పిస్తున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి నెలా ఇంధన భత్యం కూడా అందజేస్తుండటం విశేషం.
వీడియో ఇక్కడ చూడండి..
కష్టాలను ఎదుర్కొని ఎదిగిన లీడర్
ఎంకే భాటియా తన వ్యాపార ప్రయాణంలో ప్రారంభ దశలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను, నష్టాలను ఎదుర్కొన్నారు. కానీ పట్టువదలకుండా 2015లో మిట్స్ గ్రూప్ ను స్థాపించి నేడు అనేక కంపెనీలకు అధిపతిగా ఎదిగారు. తన విజయానికి కారణం తన ఉద్యోగుల కష్టమేనని నమ్మే ఆయన, సిబ్బందిని కుటుంబ సభ్యులుగా భావించి ఈ అరుదైన కానుకలతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
