కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక పెద్ద అల్లం ముక్క, 10 వెల్లుల్లి, రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ,
కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు పావు కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్,
రెండు టేబుల్ స్పూన్స్ గసగసాలు: 2 టీస్పూన్లు, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, చిన్న బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్రను తీసుకోవాలి.
ముందుగా, కేజీ మటన్‌ను మీడియం సైజు ముక్కలుగా కోసి, నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి. చివరిసారిగా, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి కడిగి, నీళ్లన్నీ వాడ్చి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన పూర్తిగా పోతుంది. ఇప్పుడు మటన్ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి ముక్కలకు బాగా పట్టించి, ఒక గంట పాటు మ్యారినేట్ చేయాలి. వీలైతే, ముందురోజు రాత్రే ఫ్రిజ్‌లో ఉంచితే మటన్ మరింత మృదువుగా అవుతుంది.
స్టవ్ మీద ఒక గిన్నె లేదా కుక్కర్ పెట్టి, 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక, 2 అంగుళాల అల్లం ముక్కలు, 10-15 వెల్లుల్లి రెబ్బలు, పెద్ద ముక్కలుగా కోసిన 2 టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించాలి. టమాటా, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత, 2 రెమ్మల కరివేపాకు, పావు కప్పు కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి (లేదా ముక్కలు), 2 టీస్పూన్ల గసగసాలు వేసి రెండు-మూడు నిమిషాల పాటు చిన్న మంటపై వేయించి, స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
అదే ప్రెషర్ కుక్కర్‌ను తిరిగి స్టవ్ మీద పెట్టి, 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. బటర్ కరిగి నూనె వేడెక్కాక, సన్నగా పొడుగ్గా కట్ చేసిన 3-4 పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసి లైట్‌గా వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలు వేసి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. నీళ్లు అస్సలు కలపకుండా, కుక్కర్ మూత పెట్టి, మటన్ ముదిరిన దాన్ని బట్టి నాలుగు-ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి చూడండి, మటన్ ముక్కలు మెత్తగా ఉడికి ఉండాలి.మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, ఉడికించిన మటన్‌లోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేయాలి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసి బాగా కలపాలి. రుచి చూసి, అవసరమైతే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో గ్రేవీ ఉడుకుతున్నప్పుడు, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి అంతా బాగా కలపాలి. తిరిగి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, ఒకే ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి, స్టవ్ ఆపివేయాలి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.





