తాజావార్తలు

Tollywood: రాజబాబుతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.. చిన్న చిన్న పాత్రలతో ఫేమస్.. చివరకు ఎలా చనిపోయారంటే..


తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది హాస్యనటులు తమదైన ముద్ర వేసుకున్నారు. కస్తూరి శివరావు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు వంటి ప్రముఖుల సరసన నిలిచే స్థాయి లేకపోయినా, చిన్న చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హాస్యకళాకారులలో చిడతల అప్పారావు ఒకరు. ఆయన జీవితం, సినీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. అప్పారావు స్వస్థలం రాజమండ్రి. ఆయన ఇంటిపేరు చిడతల కాదు, వై. చిన్నతనం నుంచే నాటకాలంటే ఎనలేని ఆసక్తి ఉండడంతో చదువు పెద్దగా కొనసాగించలేదు. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో వసంతుడిగా, చింతామణిలో సుబ్బిశెట్టిగా, రామదాసులో ధర్మకర్తగా, మధుసేవలో ఖాసిం సాహెబ్‌గా పలు పాత్రలను పోషించి మెప్పించారు. బాలనాగమ్మ నాటకంలో తిప్పడి వేషం వేసి మంచి పేరు తెచ్చుకోవడంతో, అప్పటి నుంచి ఆయనకు హాస్య పాత్రలే ఎక్కువగా లభించేవి.

నటనతో పాటు అప్పారావుకు సంగీతం, వాయిద్యాలపై మంచి పట్టు ఉండేది. పాటలు, పద్యాలు అద్భుతంగా పాడేవారు. తబలా, డోలక్, కంజీర వంటి వాయిద్యాలను అలవోకగా వాయించేవారు. బుర్రకథలు, హరికథలలో చిడతలు వాయించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండడంతో చిడతల అప్పారావుగా అందరికీ పరిచయమయ్యారు. రాజమండ్రిలో వేదాంతం జగన్నాథశర్మ స్థాపించిన నాట్య శిక్షణ కేంద్రంలో చేరి నాట్యం కూడా నేర్చుకున్నారు. రాజమండ్రికి చెందిన దర్శక నిర్మాత బి.వి. రామానందం కలకత్తాలో పెంకిపిల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు అప్పారావుకు తొలి నటన అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన వాద్య బృందంలోనూ ఆయన భాగస్వామ్యం ఉంది. ఆ తర్వాత రామానందం మద్రాసులో గుమ్మడి, జమున జంటగా జై వీరభేతాళ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు అప్పారావుకు హాస్య పాత్ర ఇచ్చారు. అయితే రామానందం మరణంతో ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.

అప్పారావు రాజమండ్రికి తిరిగి వెళ్లకుండా మద్రాసులోనే స్థిరపడి అమర సందేశం, రాజు-పేద, మేలుకొలుపు, స్త్రీ జన్మ వంటి పలు చిత్రాలలో నటించారు. సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. స్వతహాగా టైలర్ అయిన అప్పారావు సినిమా కంపెనీల్లో టైలర్‌గా పనిచేస్తూనే అప్పుడప్పుడు హాస్య పాత్రలు చేసేవారు. కొంతకాలం ఆ వృత్తిని మానేసి చిడతలు వాయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంకొంత కాలం మేకప్ మ్యాన్‌గా కూడా పనిచేశారు. ఈ విధంగా ఏ రంగంలోనూ స్థిరపడలేకపోయారు. నటననే వృత్తిగా తీసుకోవాలని నిర్ణయించుకునే సమయానికి ఆలస్యం కావడంతో ప్రధాన హాస్యనటుడిగా మారలేకపోయారు. అప్పటినుంచి చిన్న పాత్రలు వచ్చినా చేయడం అలవాటు చేసుకున్నారు. ఎన్ని వందల చిత్రాలలో నటించారో ఆయనకే తెలియదు గానీ, ఐదు వందలకు పైగా సినిమాలలో నటించారని అంచనా. నటుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్న తర్వాత ఆయన ఎప్పుడూ ఖాళీగా లేరు, అలాగని పూర్తిగా బిజీగానూ లేరు. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకొని, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రను చేసేవారు.

కోయంబత్తూరులో దేశోద్ధారకుడు చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో బాలకృష్ణ ఆధ్వర్యంలో చిడతల అప్పారావుకు ఘన సన్మానం జరిగింది. ఆ సమయంలో అప్పారావు ఎంతో సంతోషించారు. జంధ్యాల, ఇ.వి.వి. సత్యనారాయణ, దాసరి, రాఘవేంద్రరావు వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో ఆయనకు తప్పకుండా వేషం ఉండేది. ఇ.వి.వి. సత్యనారాయణ కుటుంబంతో అప్పారావుకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. రాజేష్, నరేష్ ఆయన్ని బాబాయ్ అని పిలిచేవారు. వేషాల కోసం ఎవరి చుట్టూ తిరగకుండా, దర్శకులే ఆయన్ని పిలిచి అవకాశాలు ఇచ్చేవారు. తుది శ్వాస వరకు ఆయన నటిస్తూనే ఉన్నారు. అప్పారావు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, మొదటి భార్య చనిపోవడంతో దుర్గ అనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు. వారికి కూతురు కృష్ణవేణి, కొడుకు నవీన్ అనే ఇద్దరు పిల్లలు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నవీన్ ఛాయాగ్రాహకుడిగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. తనకు ఉన్నదాంట్లోనే ఇతరులకు ఎంతోకొంత సాయం చేసిన చిడతల అప్పారావు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆయన కృషి, కళాసేవ చిరస్మరణీయం.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *