లోన్లు తీసుకున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇవ్వనుందా.. వడ్డీ రేట్లను పెంచనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి. ప్రస్తుతానికి పెంచకపోయినా.. ఈ ఏడాది చివరిలోపు పెంచే అవకాశముందని ఆర్దిక రంగ నిపుణులు, సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం పడనుంది. కేంద్రం గత ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రస్తుతానికి లోన్లు తీసుకున్నవారికి కొంత ఉపశమనం లభించింది. అయితే అంతర్జాతీయంగా యుద్దాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశముందనే వార్తలు ఆర్ధిక నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం తక్షణపై మార్పులు చేసే అవకాశం లేదు. కానీ అంతర్జాతీయంగా యుద్దాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.
డిసెంబర్ నాటికి వడ్డీ రేట్లు పెరుగుతాయా..?
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బోఫా సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. డిసెంబర్ నాటికి వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచే అవకాశముందని అంచనా వేసింది. యుద్దాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, దేశంలోని వాతావరణ మార్పులతో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది డిసెంబర్ నాటికి వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని తెలిపింది. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సమస్యల కంటే స్థానిక వాతావరణ మార్పుల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రభావితమవుతోంది. దేశంలో లోటు వర్షపాతం నమోదవ్వడం, ఎల్‌నీవో ప్రభావం రాబోయే నెలల్లో వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. కరువు పరిస్థితుల వల్ల ఆహార ధరలు భారీగా పెరుగుతాయి. దీని వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది.
రుణాలకు పెరగనున్న డిమాండ్..
బోఫా సెక్యూరిటీస్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి తన జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. చమురు ధరలు తగ్గడం వల్ల దేశ కరెంట్ అకౌంట్ లోటు కూడా జీడీపీలో 1.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇక ప్రభుత్వ ద్రవ్య లోటు 4.5 శాతంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. మెరుగుపడుతున్న ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఒక వరం అవుతుంది. ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నందున.. రిటైల్, వాహన రుణాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల డిమాండ్ పెరుగుతుంది. భవిష్యత్తు ద్రవ్యోల్బణం మరియు ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపుదల వల్ల అటువంటి సంస్థలకు రుణాలు తీసుకునే వ్యయం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐ పెరుగుతుంది. ఇది సామాన్యులకు భారంగా చెప్పవచ్చు.
