తాజావార్తలు

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది? 


వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది.

సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు

గురువారం నాటికి ఈ బ్యారియర్ లేక్‌లో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. ఇప్పటికే సరస్సు పొంగిపొర్లుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు.. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో సరస్సు చుట్టూ ఉన్న సహజ అడ్డంకి బలహీనపడితే.. భారీ మొత్తంలో నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు.

ఈ సరస్సుపై చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి మట్టాన్ని అంచనా వేస్తోంది. రెస్క్యూ ఆపరేషన్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా, మరో విపత్తు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

రెస్క్యూ కోసం రంగంలోకి చైనా బృందాలు

విపత్తు సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు చైనా రాజధాని బీజింగ్, చెంగ్డూ నుంచి ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలను తరలించింది. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కాగా, టిబెట్ లోని గైరోంగ్ పోర్టులో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించారు.

హిమాలయాలకు పెరుగుతున్న ప్రకృతి ముప్పు

హిమాలయాల్లో మంచు, హిమనీ సరస్సులు, కొండచరియల వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరత ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, మౌలిక వసతులకు, నీటి వనరులకు పెను ముప్పుగా మారుతోంది. నేపాల్, టిబెట్‌లో సంభవించిన ఈ జలప్రళయం ఒక్కసారిగా జరిగిన ఘటన మాత్రమే కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి ఘటన గతంలో కూడా జరిగింది. 2025 ఆగస్టులో టిబెట్‌లో గ్లోబల్ వార్మింగ్ వల్ల  ఓ హిమానీ సరస్సు పొంగిపొర్లి భారీ వరదలకు దారితీసింది. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. నేపాల్-చైనాను కలిపే కీలక వంతెనతో పాటు పలు మౌలిక వసతులు దెబ్బతిన్నాయి.

ఇప్పుడు మరోసారి హిమాలయాల్లో భారీ వరదలు బీభత్సం సృష్టించడంతో.. రాబోయే 72 గంటలు అత్యంత కీలకంగా మారాయి. ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలకు ఎగువన ఉన్న బ్యారియర్ లేక్ పరిస్థితి ఎలా మారుతుందోనన్న ఆందోళన నెలకొంది.

హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదలు వందల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. భోటే కోషి నది ఉప్పొంగడంతో అనేక జిల్లాలను వరద, బురద కలిసి ముంచెత్తింది. ఈ జలప్రళయానికి మంచుకొండల్లో భూకంపమే కారణమని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, హిమానీ సరస్సు బద్దలవడం వల్లే ఈ విపత్తు  సంభవించినట్లు  అమెరికా జియాలాజికల్‌ సర్వే వెల్లడించింది.

భీకర వరద నేపాల్‌ జిల్లాలను ముంచెత్తిన విపత్తులో ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు విదేశీయులే. భారత్‌ నుంచి 140 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అటు టిబెట్‌ వైపు కూడా వరద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆ దేశంలో ముగ్గురు మరణించగా 553 మందికి పైగా గల్లంతయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *