తాజావార్తలు

ఫ్లాష్‌ఫ్లడ్‌కు ముందే సమాచారం ఉందా..? చైనాపై ఆరోపణలు.. బీజింగ్‌ రియాక్షన్‌!


ఫ్లాష్‌ఫ్లడ్‌కు ముందే సమాచారం ఉందా..? చైనాపై ఆరోపణలు.. బీజింగ్‌ రియాక్షన్‌!

రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన జల ప్రళయానికి  సంబంధించి  కీలక సమాచారాన్ని చైనా దాచిపెట్టిందనే ఆరోపణలు నేపాల్‌లో వైరల్‌గా మారాయి. అయితే వీటిని ఖండిస్తూ నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

చైనా పై వచ్చిన రెండు ఆరోపణలు అవాస్తవం

తమపై ప్రధానంగా రెండు ఆరోపణలు వచ్చాయనీ చైనా ఎంబసీ తెలిపింది. విపత్తుకు ముందు చైనా సకాలంలో నేపాల్‌ను హెచ్చరించలేదని, అందువల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందనేది మొదటి ఆరోపణ. చైనా వైపు జరిగిన భౌగోళిక విపత్తుతో సంబంధం ఉన్న డ్యామ్‌ తెగిపోవడం వల్లే నేపాల్‌లో విధ్వంసం జరిగిందనేది రెండో ఆరోపణ. ఈ రెండు ఆరోపణలను చైనా ఫేక్ న్యూస్ గా కొట్టిపారేసింది. ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నందున.. ఎవరి మీదో నిందలు వేయడం కంటే సహాయక, రెస్క్యూ చర్యలపై దృష్టి పెట్టాలని చైనా సూచించింది.

భూకంపం.. ఆ తర్వాత మంచు చరియలు, కొండచరియలు

ఆగస్టు 26 ఉదయం సంభవించిన భూకంపం లేదా భూకంపాన్ని పోలిన ప్రకంపనలే ఈ విపత్తుకు కారణమై ఉండొచ్చని చైనా ఎంబసీ తెలిపింది. ఆ ప్రకంపనల కారణంగా మంచు చరియలు విరిగిపడి.. ఆ తర్వాత భారీ కొండచరియలు కిందికి దూసుకొచ్చాయని తెలిపింది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దుకు ఇరువైపులా ఈ ప్రభావం కనిపించిందని తెలిపింది.

నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంపం సంభవించి ఉండొచ్చని.. దాని కారణంగా మంచు చరియలు, అనంతరం భారీ వరదలు వచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు.

20 కి.మీ దూరంలో హిమానీ రాక్‌స్లైడ్‌

నేపాల్ విపత్తు నిర్వహణ అధికారులు కూడా ఈ ఘటనపై ప్రాథమిక వివరాలను వెల్లడించారు. రసువాగఢికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో హిమనీ ప్రాంతంలో భారీ రాళ్లు, మంచు చరియలు విరిగిపడినట్లు ఉపగ్రహ చిత్రాల్లో గుర్తించినట్లు తెలిపారు.

ఆ భారీ శిథిలాలు లెండే నదిలోకి చేరడంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని అంచనా వేస్తున్నారు. అనంతరం ఈ ప్రవాహం దిగువ ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి కారణమైంది.

వందలాది మంది గల్లంతు

ఈ ప్రకృతి విపత్తులో నేపాల్‌లో భారీ ప్రాణనష్టం జరిగింది. కనీసం 165 మంది మరణించగా వందలాది మంది గల్లంతయ్యారు. చైనాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని రసువా, నువాకోట్ జిల్లాల్లోని అనేక గ్రామాలు, జనావాసాలు వరదలు, బురద, కొండచరియల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి.

‘నిందలు కాదు.. సహాయక చర్యలపై దృష్టి పెట్టాలి’

ప్రస్తుతం నేపాల్‌, చైనా రెండు దేశాలూ సహాయక, రెస్క్యూ చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చైనా ఎంబసీ తెలిపింది. “ఇది ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే సమయం కాదు.. మానవతా సంక్షోభం నుంచి ప్రజలను బయటపడేయడానికి కలిసి పనిచేయాల్సిన సమయం” అని చైనా స్పష్టం చేసింది.

విపత్తుకు అసలు కారణం, ముందస్తు హెచ్చరికలు, భౌగోళిక పరిస్థితులపై మరింత సమాచారం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. నేపాల్‌-చైనా మధ్య ఈ ఘటనపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రం కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *