బీహార్ రాష్ట్రంలోని సివాన్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని శ్రేయా కౌశిక్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే లింకన్ స్కాలర్‌షిప్‌కు ఎంపింకైంది. ఈ ఏడాది లింకన్ స్కాలర్‌షిప్ పొందిన ఏకైక భారతీయురాలిగా శ్రేయా కౌశిక్ నిలిచింది. సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆమె అమెరికాలోని సెంటర్ కాలేజీలో నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ విద్యను పూర్తిగా ఉచితంగా అభ్యసించనుంది.
లింకన్ స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?
అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ స్మారకార్థం ఏర్పాటు చేసిన లింకన్ స్కాలర్‌షిప్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లలో ఒకటి. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి కేవలం 10 మంది విద్యార్థులను మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా చదువులో అసాధారణ ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల నిబద్దత ఉన్న 10 మంది విద్యార్థుల్ని మాత్రమే ఏటా ఎంపిక చేస్తారు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న సెంటర్ కాలేజీలో నాలుగేళ్ల డిగ్రీ చదువుకు అవసరమైన మొత్తం ఖర్చును భరిస్తారు. ట్యూషన్ ఫీజులు, వసతి, భోజనం, పుస్తకాలు, అధ్యయన సామగ్రి, ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులు, ఇతర విద్యా సంబంధిత వ్యయాలన్నీ ఇందులో భాగంగా ఉంటాయి.
ఎవరీ శ్రేయా కౌశిక్?
శ్రేయా కౌశిక్ బీహార్‌లోని సివాన్‌లో జన్మించింది. అనంతరం ఢిల్లీలోని అయా నగర్‌లో ఉన్న సర్వోదయ కన్యా విద్యాలయంలో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. 13 ఏళ్ల వయసులోనే ఆమె డెక్‌స్టెరిటీ గ్లోబల్ అనే సంస్థలో చేరి నాయకత్వ శిక్షణ, విద్యా అవకాశాలను పొందింది. ఈ కార్యక్రమం ద్వారా శ్రేయా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు, నాయకత్వ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చాటింది. జల కాలుష్య నివారణకోసం శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలను ఉపయోగించి నానో టెక్నాలజీ సాయంతో గతంలో ‘రివైవ్’ అనే నీటి వడపోత ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఇందుకు జర్మనీలోని మెర్సిడెస్-బెంజ్ ఫెలోషిప్ కింద సుమారు రూ.3.3 లక్షల క్యాటలిస్ట్ గ్రాంటును అందుకున్న యంగెస్ట్ ఏషియన్‌గానూ నిలిచింది. చిన్నవయసులోనే శ్రేయా విద్యా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిత్వం లింకన్ స్కాలర్‌షిప్ ఎంపికలో కీలక పాత్ర పోషించాయి.
ఇవి కూడా చదవండి
లింకన్ స్కాలర్‌షిప్ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని శ్రేయా పేర్కొంది. అబ్రహాం లింకన్ పేరుతో ఉన్న ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తాను పొందిన మార్గదర్శకత్వం, శిక్షణ వల్ల తన పరిస్థితులను అధిగమించి ప్రపంచస్థాయి అవకాశాలను అందుకోగలిగానని ఆమె చెప్పింది. భవిష్యత్తులో తన విద్యను సమాజానికి ఉపయోగపడేలా వినియోగిస్తానని వెల్లడించింది. శ్రేయా ఎంపికపై లింకన్ స్కాలర్స్ ప్రోగ్రామ్ అభినందనలు తెలియజేసింది. ఆమె విద్యా ప్రయాణానికి పూర్తి మద్దతు అందిస్తామని ప్రకటించింది. నాణ్యమైన మార్గదర్శకత్వం, సరైన అవకాశాలు లభిస్తే భారతీయ విద్యార్థులు ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో రాణించగలరనేది శ్రేయా విజయం నిరూపించిందని డెక్‌స్టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు, సీఈవో శరద్ వివేక్ సాగర్ అన్నారు.
