ఖమ్మం, సెప్టెంబర్ 4: గన్నేరు ఆకులు పొరపాటున పప్పులో కలవడంతో ఆ భోజనం తిన్న ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్వాడీ కేంద్రం 3లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న నాగమణి అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు. దీంతో అంగన్వాడీ టీచర్ కృష్ణకుమారి స్థానికురాలైన దార్ల సరోజిని సహాయంతో భోజనం వండిస్తున్నారు. ఈ నెల 1న సరోజిని న్యూట్రీషియన్ గార్డెన్లో బచ్చలికూర, గోంగూర కోస్తుండగా, ఆకుకూరల మధ్యలో ఉన్న గన్నేరు చెట్టు ఆకులు పొరపాటున కోసి పప్పులో కలిపారు. అనంతరం అదే పప్పుతో భోజనం వండారు. ఈ భోజనాన్ని పట్ర స్వప్న తన కుమారుడు యశ్వంత్, మరిది కుమారుడు రియాన్స్కు తినిపించడంతో పాటు తాను కూడా తిన్నారు. అలాగే తోట కుమారి తన మనుమరాలు తన్మయికి భోజనం పెట్టి, తాను కూడా తిన్నారు. వంట చేసిన పప్పులో ఒక ఆకు సరిగా ఉడకకపోవడంతో స్వప్న దానిని పరిశీలించి అది గన్నేరు ఆకుగా గుర్తించారు. అప్పటికే భోజనం చేసిన కొద్దిసేపటికే పిల్లలు, మహిళలు నీరసించడంతో కుటుంబ సభ్యులు వారిని సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి
ఈ ఘటనపై సెక్టార్ సూపర్వైజర్ రజిని.. సీడీపీఓ సత్యవతి దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల పర్యవేక్షణలో బాధితులకు వైద్య సేవలు అందించారు. ఐసీడీఎస్ డీడబ్ల్యూవో ప్రమీల ఆధ్వర్యంలో ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహించగా ఎలాంటి తీవ్రమైన సమస్య బయటపడలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐదుగురి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సీడీపీఓ సత్యవతి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం తయారీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. ఈ ఘటనపై వంట చేసిన సరోజిని మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రంలో ఆయా లేకపోవడంతో టీచర్ రోజుకు రూ.100 ఇస్తానని చెప్పడంతో వంట చేసేందుకు వెళ్లానని తెలిపారు. ఆకుకూర మొక్కల మధ్యలో ఉన్న గన్నేరు ఆకులను పొరపాటున కోసి పప్పులో వేశానని, కావాలని చేయలేదని చెప్పారు.
