అనంతపురం నగరంలో గుండెలవిసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసై నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్న కన్నకొడుకును.. ఆ కన్నతల్లే కత్తెరతో గొంతుపై పొడిచి కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం నగరానికి చెందిన సునీత అనే మహిళకు సురేంద్ర (28) అనే కుమారుడు ఉన్నాడు. సురేంద్ర గత కొంతకాలంగా తీవ్రంగా మద్యానికి బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ, మద్యం తాగడానికి డబ్బులు కావాలంటూ ప్రతిరోజూ కన్నతల్లి సునీతను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో గొడవలు చేస్తూ, ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసేవాడు.
ఎప్పటిలాగే మద్యం మత్తులో ఉన్న సురేంద్ర ఇంట్లో మళ్లీ గొడవకు దిగాడు. డబ్బుల కోసం తల్లిని తీవ్రంగా వేధించాడు. రోజురోజుకూ మితిమీరిపోతున్న కొడుకు చిత్రహింసలను భరించలేక, తీవ్ర ఆవేదనకు గురైన తల్లి సునీత ఆ క్షణంలో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఇంట్లో ఉన్న కత్తెరను తీసుకుని సురేంద్ర గొంతులో బలంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సురేంద్ర అక్కడికక్కడే విగతజీవిగా పడిపోయాడు.
ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, కన్నకొడుకును హతమార్చిన తల్లి సునీతను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
