తాజావార్తలు

ఢిల్లీకి చేరింది కాళేశ్వరం కుస్తీ..! ప్రాజెక్టు చుట్టూ పంతం పాలిటిక్స్

ఢిల్లీకి చేరింది కాళేశ్వరం కుస్తీ..! ప్రాజెక్టు చుట్టూ పంతం పాలిటిక్స్


కాళేశ్వరం కాదు, కొంప కొల్లేశ్వరం అని ప్రాసలతో పంచ్‌లతో పొట్టుపొట్టు తిట్టుకుంటున్న పార్టీలు ఇప్పట్లో అలసిపొయ్యేలా కనిపించడం లేదు. నీళ్లొదలండయ్యా బాబూ అని కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర కేటీఆర్ పోరుబాటతో మొదలైంది రాజకీయం. బలీయమైన రైతు ఓటుబ్యాంకును కొల్లగొట్టడం కోసం అధికార ప్రతిపక్షాలు కళాత్మకంగా ఫైటింగ్‌కి దిగేశాయి. దీంతో కొత్తకొత్త కలర్లలోకి మారుతోంది కాళేశ్వరం పొలిటికల్ గ్రౌండ్. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చెయ్యడానికి నెత్తురు చిందించేదాకా శ్రమిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఏ స్పష్టమైన వైఖరీ తీసుకోకపోయినా కాళేశ్వరం బ్లడీపాలిటిక్స్‌లోకి కసిగా ఎంట్రీ ఇచ్చింది తెలంగాణ కమలదండు.

తెలంగాణలో ప్రతీ కార్నర్‌లోకీ పాకింది కరువు భయం. ఎండిపోతున్న పంటపొలాలు రైతును వెక్కిరిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్ ఆరంభసూచికగా చేసుకోవాల్సిన ఏరువాక పండగైతే పూర్తిగా అటకెక్కింది. కానీ, ఇక్కడ సాగురాజకీయం మాత్రం బహుచక్కగా సాగుతోంది. నీళ్ల నుంచి నెత్తురు వైపు మళ్లింది. బీఆర్‌ఎస్‌ నేతల నెత్తురుతో పంటలు పారించాలన్న సీఎం రేవంత్‌ కామెంట్లతో తిక్కరేగి కత్తిసాముకు దిగింది గులాబీదండు. రైతులకోసం ఎంత రక్తం చిందించడానికైనా సిద్ధమని హరీష్‌రావు ఇచ్చిన కౌంటర్‌ని మొదట్లో తేలిగ్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. డైరెక్టుగా రక్తపోరాటానికే దిగేసింది బీఆర్‌ఎస్. రక్తదాన శిబిరాలతో కొత్త ట్రెండ్‌ని సెట్‌ చెయ్యబోయింది. రక్తమిస్తామంటూ బీఆర్‌ఎస్ విద్యార్థి నేతలు భారీగా తరలిరావడమే కాదు, బ్లడ్‌ ప్యాకెట్స్‌తో రేవంత్‌ ఇంటికి వెళ్లబోయారు. మీ రక్తదాహం తీర్చుకో.. కానీ, మా రైతన్నలకు నీళ్లివ్వు..! అని ఫ్లెక్సీ మీద రాసిన రాతలు రూలింగ్‌పార్టీని సూటిగా టార్గెట్ చేసినట్టున్నాయి. ఫలితంగా తెలంగాణ భవన్‌ దగ్గర హైటెన్షన్లు. తోపులాటలు, అరెస్టులు.

పంటకు నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతానంటావా, ఇంకా మీ రక్తదాహం తీరలేదా.. ఎన్‌కౌంటర్ల పేరుతో తెలంగాణ పిల్లలను కాల్చి చంపింది చాలట్లేదా? తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు ఆల్రెడీ తడిసిపొయ్యాయని ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరాన్ని రాజకీయ కక్షసాధింపు కోసం వాడుకుంటోందని, రేవంత్‌ డైలాగ్ డెలివరీని రక్తపుభాషలోకి మార్చేశారని, డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇది కూడా ఒక భాగమని తిట్టిపోసింది గులాబీదండు.

బీఆర్‌ఎస్‌ రక్తదాన శిబిరాలకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి కౌంటర్‌ ప్రోగ్రామ్‌ కూడా రెడీ. టైటిల్‌ ఏంటంటే.. అవినీతి కాళేశ్వరం. వేదిక గాంధీభవన్‌. కేసీఆర్‌ ఫోటోను పెట్టి, ప్రాజెక్టు లోపాలు ఇవీ అంటూ పెద్ద ఎగ్జిబిషనే ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అవినీతికి పాల్పడ్డ దోషుల్ని వదిలిపెట్టేదే లేదని వార్నింగులు కూడా వచ్చేశాయి. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిలా మాట్లాడటం లేదని, సైకో రాజ్‌కుమార్‌కు- సీఎం రేవంత్‌రెడ్డికి తేడా ఏమీ లేదని చేసిన కామెంట్లు గాంధీభవన్‌ని అటెన్షన్‌లోకి తెచ్చేశాయి. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ నెత్తుటి పంచాయతీ బీజేపీక్కూడా అంటుకున్నట్టుంది. సింగరేణి టూరేసిన కమలనాథులు, సీఎం రేవంత్‌రెడ్డిపై ఎర్ర భాషలోనే రెచ్చిపోయారు. రక్తాశ్రువు చిందిస్తూ రాస్తున్నా అంటూ ఎవరి రాజకీయాన్ని వాళ్లు రాసుకుంటున్నారు తెలంగాణలో. ముఖ్యంగా కాళేశ్వరం పాలిటిక్స్‌ని మలుపు తిప్పేసింది దిస్ బ్లడీ ట్రెండ్‌.

అతిపెద్ద వ్యవసాయ సంక్షోభం..

దేశంలో అతిపెద్ద వ్యవసాయ సంక్షోభం రాబోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతులేని ప్రమాదంలో పడుతోంది.. అని హెచ్చరిస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. దీనికి తగ్గట్టు భారమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ దాకా, ఈ నాలుగునెలల గ్యాపే నైరుతి రుతుపవనాలకు హాట్‌స్పాట్. మన్సూన్ గాలులు వరుణుడ్ని ఫిదా చేసి, వానలు కురిపించే సీజన్ ఇది. జూన్‌లో 19 శాతం, జూలైలో 32 శాతం వర్షాలు కురుస్తాయి. అంటే, మొదటి రెండునెలల్లోనే 50 శాతం దాకా వానలు ప్రాప్తించాలి. కానీ, ఇప్పటిదాకా సగానికి అటూఇటూనే వాన పడింది. మరో 40 శాతం వర్షపాతం ఇప్పటికే పెండింగ్. ఆగస్టు-సెప్టెంబర్ గడిచేసరికి ఈ కోత దారుణంగా పెరిగే ప్రమాదముంది. అదే జరిగితే, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ తగ్గి, రైతు ఆదాయాలు పడిపోయి, తిండిగింజలకు కొరతలొచ్చి, ఊహించలేనంత కరువు దాపురిస్తుంది, ఇదైతే పక్కా. అందుకే, దేశమంతటా ఒకలాటి ఎమర్జెన్సీ సిట్యువేషన్ నడుస్తోంది. తెలంగాణలో ఐతే అది వేరె లెవల్‌లో ఉంది.

మనదేశంలో 50 శాతానికి మించి గ్రామాల్లో సాగునీటి వ్యవస్థ లేనేలేదు. మిగతా 50 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఇరిగేషన్ సిస్టమ్‌ కాపాడుతోంది. వరదనీటిని ఆనకట్టలతో బిగబట్టి, అవసరానికి తగ్గట్టు పొలాలకు వదులుతారు. కానీ, అందుబాటులో ఉన్న నీళ్లను కూడా దిగువకు వదిలే అవకాశం లేకపోతే, వేలకోట్లు కుమ్మరించి కట్టిన డ్యామ్‌లన్నీ అనుమానాస్పదంగా మారితే..? తెలంగాణలో అదే జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఎత్తిపోతలన్నీ ఉత్తిపోతలుగా మారి, రైతుల్ని వెక్కిరిస్తున్నాయి. ఇక్కడే రాజకీయ పార్టీలు మేలుకుని, అధికారపార్టీని ఇరకాటంలోకి తోసి, పండగ చేసుకుంటాయి.

ఒకచేత్తో అపోజిషన్ పార్టీల ఎత్తుగడల్ని తిప్పికొడుతూనే, మరో చేత్తో క్షేత్రస్థాయిలో రైతాంగంతో టచ్‌లో ఉంది రేవంత్ సర్కార్. ఎల్ నినోపై వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని సీరియస్‌గా చేస్తోంది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటూ ఎక్కడికక్కడ రైతులకు అవగాహన కార్యక్రమాలు పెడుతోంది. పంటల మార్పిడిపై వ్యవసాయ శాఖ స్పెషల్ రిపోర్టే జారీ చేసింది.

వరి సాగును తగ్గించి, నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును పెంచాల్సిందే.. ఇదీ రైతుకిచ్చిన స్వీట్ వార్నింగ్. స్వచ్ఛందంగా పంటమార్పిడి చేసే రైతుకు ఎకరానికో ఐదువేలు బోనస్ కూడా అమలౌతోంది. ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా నిలబెట్టాలంటే సాగు విధానంలో మార్పులు తప్పవని క్లియర్‌కట్‌గా చెప్పేసింది టీ-సర్కార్. పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్నల్లాంటి పప్పుధాన్యాల వైపే ఫోకస్ పెంచాల్సిన అవసరాన్ని గట్టిగా చెబుతోంది. అటు, రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలపై కూడా ఆరా తీస్తోంది ప్రభుత్వం. నిజనిర్ధారణ కోసం ప్రాజెక్టుల బాట పట్టింది మంత్రుల బృందం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించడానికి బండెక్కుతున్నారు క్యాబినెట్‌ మంత్రులు. ప్రతిపక్షాల తాకిడిని తిప్పికొట్టడానికి, జనంలో ఉన్న అపోహల్ని తొలగించడానికి ఇదొక ప్రయత్నం. అందుబాటులో ఉన్న నీటిని ఎలా వినియోగంలోకి తేవాలో ప్రభుత్వం దగ్గర యుద్ధప్రాతిపదికన గట్టి ఆలోచనైతే జరుగుతోంది.

ఎల్-నినో..

ఎల్-నినోతో ఢీకొట్టడానికి ముందుగానే ఎలర్ట్ అయింది తెలంగాణ ప్రభుత్వం. రైతు నష్టపోకుండా మూడు దశల యాక్షన్ ప్లాన్ రాసుకుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్-NDSA తరహాలో డైనమిక్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రెస్పాన్స్-DDSR పేరుతో ఒక కొత్త మెకానిజాన్నే క్రియేట్ చేసింది. ప్రత్యామ్నాయ పంటలపై రైతును ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేయడమే దీని ఉద్దేశం. వర్షాభావ జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి.. వర్షపాతం, భూగర్భ జలాలు, నీటిలభ్యతపై ప్రతీవారం తప్పనిసరిగా నివేదికలు ఇవ్వాలి.. రైతునేస్తం ప్రోగ్రామ్స్‌లో ఎల్-నినోనే మెయిన్ సబ్జెక్ట్‌గా చేర్చాలి.. ఇలా స్పష్టమైన గైడ్‌లైన్స్‌తో పకడ్బందీ ఏర్పాట్లతో ఎల్‌నినోతో యుద్ధానికి సిద్ధం అంటోంది ప్రభుత్వం. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశాలు నెరవేరడం లేదన్న ఆ ఒక్క వెలితి మాత్రం రేవంత్ సర్కార్‌ని వెంటాడుతోందా?

రైతుల టాపిక్ ఐతే ఈజీగానే పాపులారిటీ పెరుగుతుంది. దాంతోపాటే పొలిటికల్ మైలేజ్ కూడా వస్తుంది. అందుకే ఇరిగేషన్ సబ్జెక్ట్‌ని ఇరగదీస్తూనే ఉంది కారు పార్టీ. రాష్ట్రంలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయ్.. డబ్బుల్లేవని చెబుతూనే ఆర్భాటాలకు ఖర్చులు చేస్తున్నారు.. సోషల్ మీడియా సోకుల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు, సాగునీటి రంగాన్ని మాత్రం అటకెక్కిచేశారు.. అని రూలింగ్‌ పార్టీనే కాదు, సీఎం మీదికే పర్సనల్ ఎటాక్ చేస్తోంది బీఆర్ఎస్.

సబ్జెక్ట్‌ను సబ్జెక్టుతోనే కొట్టాలన్న కమిట్‌మెంట్‌తో కాంగ్రెస్ పార్టీ కూడా గ్రౌండ్‌లెవల్లోకి దిగింది. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చెయ్యడం అసాధ్యం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరీక్షించకుండా ఉపయోగించడం ప్రమాదకరం.. అనే మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉంది అధికారపార్టీ. కానీ, అది మేడిగడ్డ కాదు మేటిగడ్డ… 500 ఏళ్లలో కనీవినీ ఎరుగనంత వరద వచ్చినప్పుడు కూడా తలెత్తుకు నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజ్‌పైనే అనుమానాలా… అని మళ్లీమళ్లీ ప్రశ్నిస్తోంది గులాబీపార్టీ. బ్యారేజ్‌లకు రిపేర్లు చెయ్యకుండా ఇన్నాళ్లూ గాడిదపళ్లు తోముతున్నారా అన్నది బీజేపీ పదేపదే చెబుతున్న లాజిక్. దానిక్కూడా ఆన్సరుందక్కడ. ఆనకట్టల్ని రిపేర్ చేయాలంటే దానికో పద్ధతుంది, పైగా, కేంద్రప్రభుత్వమే చొరవ చూపాలి, ఊరికే అరిచిగీపెడితే ఐపొయ్యేది కాదు అని అపోజిషన్‌కు తలంటుతోంది ఇరిగేషన్ శాఖ. కానీ, ఇంజనీర్ల మాటలు పెడచెవినబెట్టి, మంత్రులు-ముఖ్యమంత్రులే ఇరిగేషన్ శాఖలో నిర్ణయాలు తీసుకుంటున్నారని, రేవంత్ సర్కార్ అన్నదాతతో తొండాట ఆడుతోందని తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది కమలం పార్టీ.

సో, పగుళ్లిచ్చిన బ్యారేజ్ అటుతిరిగి ఇటు తిరిగీ రైతు కొంపనే ముంచుతోంది. ఒడిసిపట్టిన వరదనీళ్లను కూడా కయ్యల్లోకి వదిలే దిక్కు లేక కాళేశ్వరం నీళ్లు వృధాగా పోతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులు, అంటే 9 టీఎంసీల గోదావరి నీళ్లు ఎగువకు తరలించకుండానే దిగువకు చేరి సముద్రంలో కలిసిపోతున్నాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టు, ఇలా ఎందుకూ కొరగాకుండా పోతోందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *