వర్షం భారీగా కురుస్తోంది. అంతలోనే దగ్గర్లోని పొదల్లో ఒక వింత ఆకారం కనిపించింది. ఏంటబ్బా అని తన వద్ద ఉన్న కెమెరాతో జూమ్ చేసి చూడగా.. గుండెలు జారిపోయే దృశ్యం కనిపించింది. అక్కడుంది చిన్నాచితక జంతువు కాదు.. పులి. దాన్ని చూడగానే కెమెరా పట్టుకున్న వ్యక్తి కంగారు పడలేదు. ప్రశాంతంగా ఒక ఫొటో క్లిక్ మనిపించాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో వెనకున్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ అడవుల్లో వర్షంలో రాజసంగా కూర్చొని నదిని వీక్షిస్తున్న రాయల్ బెంగాల్ పులి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ అర్నబ్ రాయ్ బంధించిన ఈ అరుదైన దృశ్యం ప్రకృతి ప్రేమికులను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దట్టమైన పొదల మధ్య వర్షంలో తలదాచుకుని ప్రశాంతంగా నదివైపు చూస్తున్న పులిని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సుందర్బన్స్ ప్రపంచవ్యాప్తంగా రాయల్ బెంగాల్ పులులకు ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో అర్నబ్ రాయ్ కెమెరాలో బంధించిన ఈ ఫోటో పులి రాజసాన్ని మరింత అద్భుతంగా ఆవిష్కరించింది. సరైన సమయం, కచ్చితమైన కెమెరా సెట్టింగ్‌లు, ఫోకస్, లైటింగ్‌తో ఈ ఫోటోను తీసినట్లు తెలుస్తోంది. వర్షపు చినుకులు, పులి కళ్లలోని మెరుపు, చుట్టూ ఉన్న పచ్చదనం కలిసి ఈ చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇలాంటి దృశ్యాన్ని స్పష్టంగా బంధించాలంటే షట్టర్ స్పీడ్‌ను సెకనుకు 1/200 నుంచి 1/500 మధ్య ఉంచాలి. అలాగే వర్షపు పరిస్థితుల్లో తగినంత కాంతి కోసం ISO విలువను 1600 నుంచి 6400 మధ్య సెట్ చేయడం అవసరం. పులి స్పష్టంగా కనిపించేలా సరైన అపెర్చర్, ఫోకస్ మోడ్‌ను ఉపయోగించడం కూడా ఈ ఫోటో ప్రత్యేకతకు కారణమైంది.
ఈ దృశ్యం నిజమైనదేనని నిరూపించేందుకు అర్నబ్ రాయ్ అదే సందర్భానికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. సుందర్బన్స్లో మరపురాని క్షణం అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 57 లక్షలకు పైగా వ్యూస్, 5.39 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. వేలాది మంది నెటిజన్లు తమ స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
