పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బు జమ చేయడం మాత్రమే కాదు, సరైన సమయంలో జమ చేయడం కూడా ఎంతో కీలకమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెల 5వ తేదీకి ముందు డబ్బు జమ చేస్తే గరిష్ట వడ్డీ ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. పీపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ లెక్కింపు విధానం ప్రకారం, నెలలో 5వ తేదీ నుంచి ఆ నెల చివరి వరకు ఉన్న కనీస నిల్వపై వడ్డీ లెక్కిస్తారు. దీంతో 6వ తేదీ తర్వాత జమ చేసిన మొత్తానికి ఆ నెల వడ్డీ లభించదు. దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు గణనీయమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
ప్రస్తుతం పీపీఎఫ్‌పై వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతంగా కొనసాగుతోంది. ఈ పథకం 15 సంవత్సరాల లాక్-ఇన్ కాలంతో వస్తుంది. అయితే, పెట్టుబడిదారులు దీన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది ఒక స్థిరమైన, సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు.
ప్రతి సంవత్సరం కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. చక్రవడ్డీ విధానం వల్ల కాలక్రమేణా పెట్టుబడి విలువ గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు ఒకరు ప్రతి నెల రూ.5,000 చొప్పున పెట్టుబడి పెడితే, సంవత్సరానికి రూ.60,000 అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఇది సుమారు రూ.16 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది.
అదే విధంగా నెలకు రూ.10,000 పెట్టినట్లయితే, మెచ్యూరిటీ సమయానికి రూ.30 లక్షలకు పైగా రాబడి పొందవచ్చు. ఇక నెలకు రూ.12,000 పెట్టినట్లయితే, ఈ మొత్తం రూ.40 లక్షలకు దగ్గరగా చేరే అవకాశం ఉంది. పెట్టుబడి కాలాన్ని 20 లేదా 25 సంవత్సరాలకు పొడిగిస్తే, ఈ మొత్తాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
పీపీఎఫ్‌లో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు లభిస్తుంది. అలాగే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం. దీంతో పీపీఎఫ్ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఒక విశ్వసనీయ పెట్టుబడి సాధనంగా నిలుస్తోంది.





