వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరిగే G7 సమ్మిట్ 2026 సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ సహకారం, అంతర్జాతీయ భద్రత అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వారం రోజుల ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరారు. తన ప్రయాణానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో భారత వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తమ సంబంధాలను “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. భారత్-ఫ్రాన్స్ రక్షణ సంబంధాలు కూడా బలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డాసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం విస్తృతంగా వినియోగిస్తోంది. రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలోపేతమవుతోంది.
అనంతరం ప్రధాని మోదీ స్లోవేకియాలో పర్యటించనున్నారు. 1993లో స్లోవేకియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ దేశాన్ని సందర్శిస్తున్న తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ తెలిపారు. జీ7 సమావేశం, ట్రంప్‌తో భేటీ, అలాగే స్లోవేకియా చారిత్రాత్మక పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత నెలకొంది. భారత్-యూరప్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకంగా మారే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
