ఇన్నాళ్లు భూమిలోని పుట్టల్లో… బండల కింద… పొదల్లో దాక్కున్న పాములు… వర్షం కురిసిన తర్వాత ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. అదే సమయంలో కప్పలు, ఎలుకలు, ఇతర క్రిమికీటకాలు కూడా ఎక్కువగా సంచరిస్తుండటంతో… వాటి వేటలో పాములు పొలాలు, కాలనీలు, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో భూమి వేడి తగ్గడంతో… పాములు అధికంగా బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు వానాకాలం ప్రారంభం కావడంతో రైతులు వరి నాట్లు, ఇతర వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో గడ్డిలో… నీటిలో… పంట మధ్యలో ఉన్న పాములను గుర్తించలేక వాటిపై కాలు వేయడంతో… పాము కాటుకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది. వానకాలం సీజన్‌లో పాము కాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే పాములు పట్టే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉండడంతో… గ్రామాల్లో ఆందోళన నెలకొంది. రోజుకు పదికి పైగా ఫోన్ కాల్స్ వస్తున్నా… అన్ని ప్రాంతాలకు వెళ్లి పాములను పట్టడం సాధ్యం కావడం లేదని వారు చెబుతున్నారు. వ్యవసాయ పొలాల్లోనే కాదు. పట్టణాల్లోనూ ఇళ్ల ఆవరణల్లో, గోడల పక్కన, మొక్కల మధ్య, డ్రైనేజీల వద్ద కూడా పాములు కనిపిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. చిన్నారులను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
గతంలో జరిగిన పాము కాటు ఘటనలు ఇంకా ప్రజలను వెంటాడుతుండటంతో… ఈ వర్షాకాలంలో ప్రతి అడుగు భయంగానే మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో కర్ర పట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. వర్షాకాలం సీజన్లో పాముల సంచారం పెరిగిందని స్థానికులు చెప్తున్నారు. బయటికి వెళ్లాలంటే భయమేస్తుంది తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ సమయంలో పాములు కనబడుతున్నాయని అంటున్నారు. ఇటీవల కాలంలో పాముల కోసం ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి అని క్యాచర్స్ చెప్తున్నారు. సహజంగా వర్షాకాలంలోనే పాములు ఎక్కువగా వస్తాయని తెలుపుతున్నారు.
