
విశాఖపట్నం తాటి చెట్ల పాలెం సంజీవయ్య కాలనీకి చెందిన సురేంద్ర అలియాస్ కన్నా.. కంచరపాలెంకి చెందిన మణికంఠకు పరిచయం ఉంది. మణికంఠ గతంలో సంజీవయ్య కాలనీలో నివాసం ఉండేవాడు. తల్లి కోడలు సీమంతానికి డేట్ ఫిక్స్ చేసి ఆహ్వానించేందుకు బంధువుల దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో తనను తిరిగి తీసుకువెళ్లాలని కొడుకు మణికంఠకు కాల్ చేసి పిలిచింది. దీంతో కంచరపాలెం నుంచి తాటి చెట్ల పాలెం సంజీవయ్య కాలనీకి వచ్చాడు మణికంఠ. తల్లి పెన్షన్ పనులు చూసుకుని తన కూతురు ఇంటికి వెళ్లింది. మణికంఠ అక్కడే పార్కు సమీపంలో ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ ఇంతలోనే సురేంద్ర, మణికంఠ మధ్య వాగవాదం మొదలైంది. మణికంఠపై దాడి చేశాడు సురేంద్ర. బలంగా కొట్టేసరికి కుప్పకూలిపోయాడు. అయినప్పటికీ విడిచిపెట్టకుండా తీవ్రంగా కొట్టాడు సురేంద్ర. స్థానిక యువకులు అప్రమత్తమై పరుగులు పెట్టి సురేంద్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ నుంచి అతడు పారిపోయాడు. కుప్పకూలిన మణికంఠను స్థానిక యువకులు సీపీఆర్ చేశారు. అంబులెన్స్‌కు కాల్ చేశారు. సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. తమ స్నేహితుడిని కాపాడుకోలేకపోయామని ఆవేదన చెందుతున్నారు ప్రత్యక్ష సాక్షులు.
కారణం అదేనా..
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న సురేంద్రను పట్టుకున్నారు . ఘర్షణకు గల కారణం ఏమిటనే దానిపై ఆరా తీశారు పోలీసులు. అయితే హోమ్ కేర్ సర్వీసెస్ పేరుతో మ్యాన్ పవర్ ప్రొవైడర్‌గా ఉన్నాడు మృతుడు మణికంఠ. వ్యాపారంతో పాటు వీడియోలు అప్లోడ్ చేస్తూ యూట్యూబర్ గాను మణికంఠ గుర్తింపు పొందాడు. మరో వైపు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేంద్ర.. అవకాశం వచ్చినప్పుడు ఈవెంట్లకు బౌన్సర్ గానూ వెళ్తున్నాడు. అయితే పబ్లిక్ ప్లేస్‌లో మద్యం తాగొద్దని చెప్పినందుకు ఘర్షణకు కారణమైందని పోలీసుల ప్రాథమిక నిర్ధారించారు. చెప్పిన మాట వినకపోవడంతో పాటు ఎదురు సమాధానం ఇవ్వడంతో తట్టుకోలేక మణికంఠపై బలంగా దాడి చేశాడు సురేంద్ర. ఈ కారణం గానే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడని కంచరపాలెం సీఐ రామారావు అన్నారు.
మందలించాలి గాని..
ఏదైనా తప్పు చేస్తే మందలించాలేగాని.. ఇలా విచక్షణ రహితంగా దాడి చేసి మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు యువకులు. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో నిండు గర్భిణీ తన భర్తను కోల్పోయింది. తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఒక గానొక కొడుకును కోల్పోయింది ఆ తల్లి. క్షణికావేశంలో చేసిన దాడితో స్నేహితుడి మరణానికి కారణమైన సురేంద్ర కటకటాల్లోకి వెళ్లాడు. ఒక్క ఘటన మూడు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
