
పార్వతీపురం, జూన్ 19: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. ప్రభాకర్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఆయన తన కుమారుడు ఎన్. క్రిష్ ధరన్ రెడ్డిని పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. సాధారణంగా ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించేందుకు ఆసక్తి చూపే పరిస్థితుల్లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి మాత్రం తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంతో విద్యా వ్యవస్థ పై ఆయనకున్న నమ్మకం గొప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
క్రిష్ ధరన్ రెడ్డి ఇంతకుముందు విజయవాడలోని కేబీసీ జడ్పీ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. తాజాగా పార్వతీపురం బదిలీతో వచ్చిన కలెక్టర్ తన కుమారుడి చదువును స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగించాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల బోధన పై ప్రజల్లో సానుకూల సందేశం వెళ్లే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు.
కలెక్టర్ కుమారుడు తమ పాఠశాలలో చేరడం తమకు గర్వకారణమని డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ తెలిపారు. ఒక జిల్లా కలెక్టర్ తన సొంత కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ విద్యపై సమాజానికి మంచి సందేశం ఇచ్చారని ఆయన అన్నారు. దీనివల్ల మరింత మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇది ఒక మంచి ప్రోత్సాహంగా నిలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు. అధికారులే ప్రభుత్వ విద్యాసంస్థలను నమ్మి తమ పిల్లలను చేర్పిస్తే ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని, ఈ నిర్ణయం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లావాసులు జిల్లావాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
