తాజావార్తలు

కోచ్‌గా గంభీర్‌ను పీకిపారేయండి.. ఆయన శతృవుని రంగంలోకి దింపండి.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!

కోచ్‌గా గంభీర్‌ను పీకిపారేయండి.. ఆయన శతృవుని రంగంలోకి దింపండి.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!


Team India Coach Controversy: భారత క్రికెట్ జట్టులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శైలిపై మాజీ పేసర్ ఎస్. శ్రీశాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గంభీర్ కఠినమైన వైఖరి జట్టుకు నష్టం చేకూరుస్తోందని, టీమిండియాకు ఇప్పుడు కోచ్ కంటే ఆటగాళ్లను అన్నలా ఆదరించే ఎంఎస్ ధోనీ లాంటి మెంటార్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

గంభీర్ వర్సెస్ సీనియర్లు: శ్రీశాంత్ ఘాటు విమర్శలు..

ఇటీవల ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్.. గంభీర్ కోచింగ్ పద్ధతులపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పట్ల గంభీర్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే రోహిత్, విరాట్ అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని, ఇప్పుడు వారి వన్డే కెరీర్‌పై కూడా కత్తి వేలాడుతోందని శ్రీశాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేకేఆర్ జట్టుకు మెంటార్‌గా విజయం సాధించినంత మాత్రాన, అదే ఫార్ములాను జాతీయ జట్టుపై రుద్దడం తగదని హితవు పలికారు.

కోచ్ వద్దు.. ధోనీ లాంటి మెంటార్ కావాలి..!

“భారత జట్టుకు కోచ్‌ను మార్చాల్సిన సమయం వచ్చింది. మనకు ఆర్డర్లు వేసే కోచ్ కంటే, ఆటగాళ్లను నడిపించే మెంటార్ కావాలి” అని శ్రీశాంత్ స్పష్టం చేశారు. గెలిచినప్పుడు నవ్వి, ఓడిపోయినప్పుడు కోప్పడే వ్యక్తి కోచ్‌గా పనికిరాడని పరోక్షంగా గంభీర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆటగాళ్లతో అన్నలా ఉంటూ, వారి మానసిక ధైర్యాన్ని పెంచే మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్‌గా తీసుకురావాలని బిసిసిఐకి విజ్ఞప్తి చేశారు. ధోనీకి జట్టులోని ఆటగాళ్లందరితోనూ ఎంతో ఆత్మీయ బంధం ఉందని ఆయన గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: ధోనీ వర్సెస్ కోహ్లీ.. ఏంది ఇద్దరి మధ్య ఇంత తేడా ఉందా.. అసలు మ్యాటర్ తెలిస్తే అవాక్కే..!

ప్రపంచకప్ విజయం క్రెడిట్ గంభీర్‌కేనా?

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026 విజయం గురించి మాట్లాడుతూ.. గంభీర్‌కు మాత్రమే మొత్తం క్రెడిట్ ఇవ్వడాన్ని శ్రీశాంత్ తప్పుబట్టారు. మైదానంలో అద్భుతంగా కెప్టెన్సీ చేసిన సూర్యకుమార్ యాదవ్, అద్వితీయ ప్రదర్శనతో టోర్నమెంట్ ఆటగాడిగా నిలిచిన సంజు శాంసన్‌లకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైదానంలో సరైన సమయంలో బౌలింగ్ మార్పులు చేసి మ్యాచ్‌లను గెలిపించింది ఆటగాళ్లే కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న కోచ్ కాదని గంభీర్ వైఖరిని ఎండగట్టారు. గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా లాగా ఆటగాళ్లతో కలిసిపోయే వ్యక్తులు భారత్‌కు అవసరమని పేర్కొన్నారు.

గంభీర్ హయాంలో ఒడిదుడుకులు..

గంభీర్ నాయకత్వంలో భారత్ రెండు ఐసీసీ టోర్నీలను సులభంగానే గెలుచుకున్నప్పటికీ, ద్వైపాక్షిక సిరీస్‌లలో జట్టు ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌లలో క్లీన్ స్వీప్ అవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గంభీర్, శుభ్‌మన్ గిల్ కాంబినేషన్‌లో ఇంగ్లాండ్ పర్యటనను 2-2తో డ్రా చేసుకోగలిగినప్పటికీ, జట్టులో వస్తున్న పెను మార్పులు, సీనియర్ల నిష్క్రమణ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *