తాజావార్తలు

LPG సబ్సీడీ కావాలా? అయితే ఇక ప్రతి ఏడాది ఇది తప్పనిసరి

LPG సబ్సీడీ కావాలా? అయితే ఇక ప్రతి ఏడాది ఇది తప్పనిసరి


కేంద్ర ప్రభుత్వ ఎల్పీజీ గ్యాస్‌ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కీలక సూచనలు జారీ చేశాయి. గ్యాస్‌ సబ్సిడీ కొనసాగాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేశాయి. ఇండియన్‌ ఆయిల్‌, హెచ్‌పీ, భారత్‌ పెట్రోలియం వంటి కంపెనీల వినియోగదారులు బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్‌ వినియోగదారులు మూడు మార్గాల్లో ఈ-కేవైసీ చేయించుకోవచ్చు. సంబంధిత గ్యాస్‌ కంపెనీ మొబైల్‌ యాప్‌ ద్వారా స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. లేకపోతే సమీప గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్‌ ధ్రువీకరణ చేయించుకోవచ్చు. అదేవిధంగా ఇంటికి సిలిండర్‌ డెలివరీ చేసే సిబ్బంది వద్ద ఉండే మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ఈ మూడు సేవలు పూర్తిగా ఉచితమని అధికారులు తెలిపారు.

గ్యాస్‌ సబ్సిడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏడాదికి గరిష్ఠంగా 9 సిలిండర్ల వరకు రాయితీ ఇస్తోంది. అయితే 8వ, 9వ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీని ఈ-కేవైసీ పూర్తి అయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తారు. వినియోగదారులు మార్చి 31లోపు బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేస్తే నిలిపివేసిన సబ్సిడీ మొత్తాన్ని తిరిగి జమ చేస్తారు. గడువు దాటితే ఆ రాయితీ శాశ్వతంగా రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ-కేవైసీ పూర్తి చేయకపోయినా గ్యాస్‌ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. సిలిండర్‌ సరఫరా యథావిధిగా కొనసాగుతుంది. కానీ కేంద్ర సబ్సిడీ మాత్రం జమ కాదని పేర్కొన్నాయి. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు కె. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా యాప్‌, డిస్ట్రిబ్యూటర్‌ కార్యాలయం లేదా డెలివరీ సిబ్బంది ద్వారా వీలైనంత త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్యాస్‌ సబ్సిడీ, ఈ-కేవైసీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక PMUY వెబ్‌సైట్‌(http://www.pmuy.gov.in/e-kyc.html)లో తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *