PBKS vs RR : ఐపీఎల్ 2026లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ విజయయాత్రకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 28న జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇదే తొలి ఓటమి. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దానిని కాపాడుకోవడంలో పంజాబ్ విఫలమైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ, అసలు ముద్దాయి ఎవరో నిర్మొహమాటంగా చెప్పేశాడు. బ్యాటర్లను వెనుకేసుకొచ్చిన అయ్యర్, బౌలర్ల వైఫల్యం వల్లే ఈ మ్యాచులో ఓడిపోయామని నేరుగా విమర్మించారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజంటేషన్ సెర్మనీలో శ్రేయస్ అయ్యర్ చాలా స్పష్టంగా మాట్లాడారు. “ఈ మ్యాచులో 222 పరుగులు అనేది చాలా గొప్ప స్కోరు. మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు, వారికి హ్యాట్సాఫ్. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మేము అనుకున్న ప్లాన్‌ను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం” అని అయ్యర్ అసహనం వ్యక్తం చేశారు. స్లోయర్ బంతులు, యార్కర్లు వేయాలని ముందే నిర్ణయించుకున్నా, బౌలర్లు మైదానంలో వాటిని సరిగ్గా వేయలేకపోయారని అదే తమ ఓటమికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు డొనావన్ ఫెరీరా, శుభమ్ దూబే మధ్య నెలకొన్న భాగస్వామ్యం మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని అయ్యర్ అంగీకరించారు. “ప్రస్తుత క్రికెట్‌లో బ్యాటర్లు మొదటి బంతి నుంచే అటాక్ చేస్తున్నారు. అలాంటి సమయంలో బౌలర్లకు నిర్దిష్టమైన ప్లాన్ ఉండటం ముఖ్యం. కానీ ఆ ప్లాన్ అమలు కానప్పుడు ఫలితం ఈ విధంగానే ఉంటుంది. ఈ రోజు మా రోజు కాదు” అని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులు ధారాళంగా ఇవ్వడం పంజాబ్‌కు మైనస్ అయింది.
వరుస మ్యాచ్‌లు, ప్రయాణాల వల్ల ఆటగాళ్ల శరీరం కొంత అలసిపోయి ఉండవచ్చని కూడా కెప్టెన్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. మాకు ఒక మ్యాచ్ ముగియగానే ప్రయాణం చేసి వచ్చి వెంటనే మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అలసట ప్రభావం ఉండవచ్చు, కానీ దానిని మేము సాకుగా చెప్పదలచుకోలేదు. మాకు కొన్ని రోజులు విరామం ఉంది, మళ్ళీ డ్రాయింగ్ బోర్డ్ దగ్గరకు వెళ్లి మా లోపాలను సరిదిద్దుకుని బలంగా తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్నప్పుడు ఇలాంటి ఓటములు సహజమని, కానీ వీటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు.
జట్టు ఓడిపోయినా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను శ్రేయస్ అయ్యర్ మెచ్చుకున్నారు. పిచ్ కొంచెం స్టిక్కీగా ఉండటంతో స్పిన్నర్లకు అనుకూలించింది. తన మొదటి మ్యాచ్ ఆడుతున్న బ్రార్, ఏమాత్రం భయం లేకుండా 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి జట్టులో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచారు. ఆయన ఆటిట్యూడ్ నాకు చాలా నచ్చిందని కొనియాడారు. పంజాబ్ కింగ్స్ ఇప్పుడు కొత్త వేదికపై తమ తదుపరి మ్యాచ్ ఆడబోతోంది. అక్కడ కచ్చితంగా గెలిచి మళ్ళీ ట్రాక్ లోకి వస్తామని అయ్యర్ ముగించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
