తాజావార్తలు

8వ వేతన సంఘం అప్‌డేట్.. జీతాలు భారీగా పెంపు? డబ్బు చేతికి వచ్చేది ఎప్పుడంటే?

8వ వేతన సంఘం అప్‌డేట్.. జీతాలు భారీగా పెంపు? డబ్బు చేతికి వచ్చేది ఎప్పుడంటే?


8వ వేతన సంఘం అప్‌డేట్.. జీతాలు భారీగా పెంపు? డబ్బు చేతికి వచ్చేది ఎప్పుడంటే?

భారతదేశంలో 8వ వేతన సంఘం ప్రక్రియ వేగవంతం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు పెరుగుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అయితే తుది అమలు సమయంపై ఇంకా స్పష్టత లేకపోవడం గమనార్హం. నిపుణుల ప్రకారం ఈ వేతన సంఘం కాగితాలపై 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, వాస్తవంగా పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లోకి రావడానికి 2026 చివరి వరకు లేదా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యం కావచ్చు. గత వేతన సంఘాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంచనాలు వెలువడుతున్నాయి.

యాంబిట్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం 8వ వేతన సంఘం అమలు తరువాత జీతాలు, పెన్షన్లు 30–34 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల సుమారు 1.1 కోట్ల మంది లబ్ధిదారులు ప్రభావితం అవుతారని అంచనా. ఈ పెంపు దేశీయ వినియోగాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశముంది. పెరుగుదల తుది స్థాయి మాత్రం పే మ్యాట్రిక్స్ మార్పులు, అలవెన్సుల సవరణలు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 50.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అదనంగా పాత పెన్షన్ పథకం కింద సుమారు 69 లక్షల మంది, జాతీయ పింఛను వ్యవస్థ కింద మరికొంత మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ఈ వేతన సవరణ ప్రభావం పడనుంది. ప్రస్తుతం వేతన సంఘం సంప్రదింపుల దశలో ఉంది. ప్రభుత్వం పలు వర్గాల నుండి సూచనలు, అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో MyGov పోర్టల్ ద్వారా ప్రశ్నావళికి సమాధానాలు సమర్పించడానికి గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పణలను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *