రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కొన్ని గంటల పాటు ఆగిపోనుంది. మార్చి 14,15వ తేదీల్లో సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపడుతున్నారు. దీని కారణంగా రైల్వే టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్, వెయిటింగ్ లిస్ట్, పీఎన్ఆర్ స్టేటస్ చెకింగ్ వంటి సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోతాయని రైల్వేశాఖ తెలిపింది. దీంతో ప్రయాణికులు సహరించాలని కోరింది.
మార్చి 19వ తేదీన ఉగాది వస్తుండటంతో చాలామంది సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పండుగ సెలవులు కారణంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. ఈ క్రమంలో రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ సేవల్లో అంతరాయం కలగనుండటం ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోలేరని, అలాగే పీఎన్ఆర్ స్టేటస్ చెకింగ్ కూడా అందుబాటులో ఉండదని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఇక అలాగే బుక్ చేసుకున్న టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకోలేరు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడనుంది. అయితే ఢిల్లీ పీఆర్ఎస్ సిస్టమ్‌తో అనుసంధానమైన సేవలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలుస్తోంది. ప్రయాణికులు తక్కువగా టికెట్లు బుక్ చేసుకునే అర్థరాత్రి సమయంలో ఈ అప్‌గ్రేడ్ కార్యకలాపాలు చేపట్టనున్నారు.
దాదాపు మూడు గంటల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో రైల్వే రిజర్వేషన్ల వ్యవస్థ పూర్తిగా అందుబాటులో ఉండదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ సమయంలో ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139ను సంప్రదించి సేవలు పొందాలని అధికారులు సూచిస్తున్నారు. సేవలకు అంతరాయం కలిగే ముందే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవాలని, ఇతర సేవలు యాక్సెస్ చేయాలని సూచించింది.
టికెట్ల బుకింగ్స్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో అనేక మార్పులు చేస్తున్నారు. ఇటీవల టికెట్ల బుకింగ్‌కు ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేశారు. ఇక తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధృవీకరణను తప్పనిసరిగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్ సిస్టమ్‌లో అనేక మార్పులు చేస్తున్నారు.





