తాజావార్తలు

Andhra Pradesh: వినాయక చవితి వేళ పొలంలో బయటపడ్డ వింత రూపం.. చూసేందుకు ఎగబడుతున్న జనం..


వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మార్కెట్లలో కందకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కంద తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన ఓ కంద దుంప స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా గుండ్రంగా లేదా ఒక మోస్తరు ముద్దలా ఉండే కంద దుంపలకు పూర్తి భిన్నంగా.. ఇది అచ్చం తాబేలు ఆకృతిని పోలి ఉండటం విశేషం. పొలంలో మట్టిని తొలగించి దుంపను బయటకు తీసిన సమయంలో రైతుతో పాటు కూలీలు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కంద దుంపకు సహజసిద్ధంగానే తాబేలు వీపును పోలిన పైపెంకు, ముందుకు పొడుచుకొచ్చిన తల భాగం, అలాగే నాలుగు కాళ్ల ఆకృతులు స్పష్టంగా ఏర్పడ్డాయి. మొదటి చూపులో చూసిన ఎవరికైనా ఇది నిజమైన సజీవ తాబేలేమో అన్న భ్రమ కలిగించేలా ఉండటంతో ఈ విషయం క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల గ్రామాలకు దావానలంలా వ్యాపించింది.

ప్రకృతి ఒడిలో రూపుదిద్దుకున్న ఈ వింత కందను చూసేందుకు గ్రామస్తులు, సమీప ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూ, తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. కొందరు భక్తులు వినాయక చవితి వేళ కూర్మ రూపంలో కంద వెలికిరావడాన్ని ప్రత్యేకంగా భావిస్తుండగా, ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారాయి.

ఈ వింత ఆకృతిపై ఉద్యానవన శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. భూమిలో దుంప వృద్ధి చెందే క్రమంలో అక్కడి నేల సాంద్రత, మట్టిలోని గట్టి రాళ్ళు, భూగర్భంలో ఎదురయ్యే సహజ అవరోధాలు, తేమ హెచ్చుతగ్గుల వల్ల ఎదుగుదల ఒకవైపు ఒత్తిడికి గురవుతుందని తెలిపారు. ఆ ఒత్తిడి కారణంగానే కణాల విభజనలో మార్పులు వచ్చి ఒక్కోసారి ఇలాంటి విచిత్ర ఆకారాలు సంతరించుకుంటాయని, ఇది పూర్తిగా సహజమైన భౌతిక ప్రక్రియే తప్ప ఇందులో ఎలాంటి అద్భుతం లేదని వివరించారు. ఏది ఏమైనా పండుగ వేళ వెలుగుచూసిన ఈ తాబేలు కంద ప్రస్తుతం స్థానికంగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *