తాజావార్తలు

అబ్బబ్బ.. ఆరోగ్యకరమైన టేస్టీ టిఫిన్ ఇదే.. ఈ దోశ తింటే శరీరానికి సూపర్ బలం..


ఆరోగ్యకరమైన, టేస్టీ అల్పాహారం కోసం వెతుకుతున్నారా? అయితే ఉల్లి పెసరట్టు సరైన ఎంపిక. కొన్ని టిప్స్ పాటిస్తే.. హోటల్ స్టైల్ ఉల్లి పెసరట్టు రెసిపీ.. మీ ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. హోటళ్లలో దొరికే దానికంటే కూడా మెరుగైన రుచిని ఇంట్లోనే సొంతం చేసుకోవచ్చు.. వాస్తవానికి పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, శరీర శక్తికి మంచిగా ఉపయోగపడతాయి.. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరచడానికి.. మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి..

రుచికరమైన ఉల్లి పెసరట్టు రెసిపీ కోసం కావలసిన పదార్థాలు:

  • పెసలు: 1 1/2 కప్పులు
  • బియ్యం: 1/2 కప్పు
  • పచ్చిమిర్చి: 3 (రుబ్బడానికి) + 1 చిన్నది (ఉల్లిపాయ మిశ్రమంలోకి)
  • అల్లం: 2 అంగుళాల ముక్క (రుబ్బడానికి) + చిన్న ముక్కలు (ఉల్లిపాయ మిశ్రమంలోకి)
  • ఉప్పు: 1/2 టీస్పూన్ (లేదా రుచికి సరిపడినంత)
  • పసుపు: 1/4 టీస్పూన్
  • జీలకర్ర: 1 టీస్పూన్
  • ఉల్లిపాయ: 1 మీడియం సైజు (చిన్న ముక్కలుగా తరిగింది)
  • కొత్తిమీర: కొద్దిగా (తరిగినది)
  • నూనె: అవసరమైనంత

తయారీ విధానం:

నానబెట్టడం: ముందుగా, ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల పెసలు, అరకప్పు బియ్యం తీసుకుని, వాటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆపై తగినన్ని నీళ్ళు పోసి, ఆరేడు గంటలు లేదా రాత్రిపూట నానబెట్టుకోవాలి. రాత్రిపూట నానబెడితే మరుసటి రోజు ఉదయానికి పెసలు, బియ్యం చక్కగా నాని సిద్ధంగా ఉంటాయి.

రుబ్బడం: నానిన పెసలు, బియ్యం నుండి నీటిని వంపేసి, మరొక్కసారి కడగాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులోకి మూడు పచ్చిమిర్చి, రెండు అంగుళాల అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు (సుమారు 1/2 టీస్పూన్), పావు టీస్పూన్ పసుపు, తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. మధ్యస్థంగా, దోస పిండిలా ఉండాలి.

పిండిని సిద్ధం చేయడం: రుబ్బిన పిండిని ఒక బౌల్ లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి, పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. వెంటనే దోసెలు వేసుకోవచ్చు కానీ, మంచి రుచి కోసం పిండిని ఒకటి లేదా రెండు గంటలు నానబెడితే దోసెలు మరింత టేస్టీగా ఉంటాయి.

ఉల్లిపాయ మిశ్రమం తయారీ: ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి ఉల్లిపాయల్లో కలుపుకోవాలి. కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

పెసరట్టు కాల్చడం: స్టవ్ ఆన్ చేసి, పాన్ లేదా పెనం పెట్టుకోవాలి. నాన్-స్టిక్ పాన్ కంటే కూడా సాధారణ పెనం మీద వేసుకుంటే పెసరట్టు మరింత రుచిగా ఉంటుంది. పెనం వేడయ్యాక, రెండు చుక్కల నూనె వేసి, టిష్యూతో పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకుని, పెనం పైన పల్చగా, గుండ్రంగా స్ప్రెడ్ చేయాలి.

వంట పూర్తి చేయడం: పిండి పైన మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని సమానంగా వేసుకోవాలి. పైన ఒక టీస్పూన్ నూనె వేసి, మధ్యస్థ మంటపై దోసెను బాగా కాలనివ్వాలి. దోసె చుట్టూ బ్రౌన్ రంగు వచ్చేవరకు, క్రిస్పీగా మారేవరకు కాల్చాలి.

దోసె బాగా కాలిన తర్వాత, నిదానంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. పైన లైట్ గా ప్రెస్ చేస్తే ఉల్లిపాయలు విడిపోకుండా ఉంటాయి. మీకు దోసె మరింత క్రిస్పీగా కావాలంటే, మరొక నిమిషం పాటు రెండు వైపులా కొంచెం సేపు కాల్చవచ్చు. అంతే, వేడివేడి ఆనియన్ పెసరట్టు సిద్ధమవుతుంది.

మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా అన్ని దోసెలను తయారు చేసుకోవాలి. ఈ పెసరట్టును కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో కలిపి తింటే రుచి చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ సులభమైన, రుచికరమైన పెసరట్టు రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *