యూరప్ దేశాలు గతంలో తమ బంగారాన్ని అమెరికాలో భద్రపరుచుకునేవి. కానీ ఇప్పుడు వాటిని తమ దేశాలకు వెనక్కి తెప్పించుకుంటున్నాయి. తాజా పరిణామాల్లో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ (డీ నెదర్లాండ్సీ బ్యాంక్) అమెరికా, కెనడాలో ఉన్న సుమారు 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు తరలించింది. గతంలో ఫ్రాన్స్ కూడా ఇలాగే వెనక్కి తెప్పించుకుంది. రాబోయే రోజుల్లో ఆర్థిక లేదా రాజకీయ సంక్షోభాలు ఎదురైతే సొంత దేశాల్లో బంగారం ఉండటం సురక్షితమని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. సురక్షితమైన ప్రదేశంగా నమ్మిన అమెరికాపై ఆధారపడటం తగ్గించి, అత్యవసర సమయాల్లో తమ నిల్వలను వెంటనే అందుబాటులో ఉంచుకోవాలని చూస్తున్నాయి.
అయితే ఈ బంగారాన్ని ఇప్పుడే ఖర్చు పెట్టడానికి కాకుండా, భవిష్యత్తులో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా తమ వద్దే ఉంచుకుంటున్నట్లు నెదర్లాండ్స్ డీఎన్బీ అధ్యక్షుడు ఓలాఫ్ స్లీజ్పెన్ తెలిపారు.
ఈ తాజా చర్యల ద్వారా లండన్‌లో నెదర్లాండ్స్ బంగారు వాటా 32.1 శాతానికి పెరిగింది. అయితే నెదర్లాండ్స్ , అమెరికా నుంచి బంగారం నేరుగా భౌతికంగా తరలించలేదు. దాదాపు 59 టన్నుల బంగారాన్ని అమెరికాలోనే విక్రయించి, దానికి బదులుగా లండన్‌లో నిల్వలను ఏర్పాటు చేసుకుంది. మరో 27 టన్నుల బంగారాన్ని మాత్రం అమెరికా, కెనడాల నుంచి తమ స్వంత పట్టణమైన జీస్ట్కు రప్పించుకుంది.
ప్రస్తుతం అమెరికాకు, యూరప్ దేశాలకు మధ్య సంబంధాలు బలహీనపడుతుండటం వల్లే ఆ దేశాలు తమ బంగారాన్ని వెనక్కి తెచ్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా తమ బంగారు నిల్వలను వెనక్కి తెప్పించుకుంటున్నాయి.
అమెరికా వద్ద తమ బంగారాన్ని ఉంచడం ఇకపై సురక్షితం కాదని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) స్వేచ్ఛగా పనిచేయగలదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు నిల్వలు ఉన్న జర్మనీ దగ్గర మొత్తం 3,352 టన్నుల బంగారం ఉంది. ఇందులో దాదాపు 1,200 టన్నులు ఇప్పటికీ న్యూయార్క్‌లోనే ఉంది. అలాగే మూడో అతిపెద్ద నిల్వలున్న ఇటలీ తన బంగారంలో 43 శాతాన్ని అమెరికా లాకర్లలోనే దాచింది . రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆర్థికంగా ఎంతో స్థిరంగా ఉంటుందని నమ్మి ఈ దేశాలు తమ బంగారాన్ని అక్కడికి తరలించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారడంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
