Team India: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ తన బౌలింగ్ పదునును మాత్రం ఎక్కడా తగ్గనివ్వడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా సాగుతున్న 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్త్‌హాంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్, డర్హామ్‌తో జరిగిన 43వ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో కట్టుదిట్టం చేశాడు. నార్త్‌హాంప్టన్ గ్రౌండ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ జట్టు చాహల్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌లో అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చాహల్ 15.2 ఓవర్లలో కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 3 మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అలెక్స్ లీస్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, మ్యాథ్యూ పాట్స్, కేసీ ఆల్డ్రిడ్జ్‌లను పెవిలియన్‌కు పంపాడు. డర్హామ్ బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్‌హామ్ (81 పరుగులు) మినహా మరెవరూ హాఫ్ సెంచరీ మార్కును దాటలేకపోయారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, పాట్స్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
వైట్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన చాహల్, గత మూడేళ్లుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లోనే అతను చివరిసారిగా భారత్ తరఫున మైదానంలోకి దిగాడు. ఆ తర్వాత కొత్త తరం స్పిన్నర్లకు ప్రాధాన్యం పెరగడంతో చాహల్‌కు అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ నిరాశ చెందకుండా కౌంటీ క్రికెట్‌లో క్రమం తప్పకుండా ఆడుతూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు.
యుజ్వేంద్ర చాహల్ అంతర్జాతీయ కెరీర్‌ను పరిశీలిస్తే, ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 27.13 సగటుతో 121 వికెట్లు తీశాడు. ఇందులో 42 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఇక పొట్టి ఫార్మాట్ టీ20ల్లో 25.09 సగటుతో 96 వికెట్లు నేలకూల్చాడు. టి20ల్లో 25 పరుగులకు 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు కౌంటీల్లో చూపిస్తున్న ఈ ఫామ్ రాబోయే రోజుల్లో అతని కంబ్యాక్‌కు బాటలు వేస్తుందేమో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
