కానీ సరైన పద్ధతిలో పప్పులు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకులను నూనెలో వేయించి రుబ్బితే ఇంట్లోనే అంతకంటే అద్భుతమైన రుచితో 'హోటల్ స్టైల్ పల్లీ చట్నీ'ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆ సీక్రెట్ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.
కావలసిన పదార్థాలు: ఒక కప్పు వేరుశనగ గుళ్లు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, 10 నుండి 12 పచ్చిమిరపకాయలు కారానికి తగినట్లు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, అర అంగుళం ముక్క అల్లం ముక్కలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు మరియు నూనె.
తాళింపు కొరకు: ఒక టేబుల్ స్పూన్ నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, రెండు ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి మరియు తాజా కరివేపాకు. చట్నీ మసాలా వేయించే విధానం: స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక ఒక కప్పు పల్లీలను వేసి మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి, కాబట్టి నిదానంగా వేయించి పొట్టు కాస్త విడిపోయే సమయంలో ప్లేట్లోకి తీసుకోవాలి.
అదే పాన్‌లోని నూనెలో పచ్చి శనగపప్పు, మినపప్పు వేసి దోరగా సువాసన వచ్చే వరకు వేయించి పల్లీలున్న ప్లేట్లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో పచ్చిమిర్చి తుంపి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు మరియు చింతపండు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. అల్లం, వెల్లుల్లి, కరివేపాకులను పచ్చిగా కాకుండా ఇలా నూనెలో వేయించడం వల్లే చట్నీకి అసలైన హోటల్ ఫ్లేవర్ లభిస్తుంది.
రుబ్బడం & పోపు పెట్టడం: వేయించిన దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, అవసరమైనన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి కమ్మని తాలింపు పెట్టి చట్నీపై వేసి కలపాలి. అంతే, గుబాళించే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ సిద్ధం! వేడివేడి ఇడ్లీ, దోసతో తింటే ఇడ్లీల కంటే చట్నీయే ముందు ఖాళీ అయిపోతుంది!





