తాజావార్తలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు


తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న ‘తల్లీ – బిడ్డ ఎక్స్‌ప్రెస్’ నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (జూలై 20) సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం 500 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ఆయన ఆమోదం తెలిపారు.

ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, వారితో పాటు వచ్చే సహాయకులను పూర్తిగా ఉచితంగా వారి ఇళ్లకు చేర్చనున్నారు. అలాగే అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా ఈ వాహనాలను వినియోగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను ఈ సేవల కోసం కేటాయించగా, ప్రతి ఏడాది సుమారు 2.75 లక్షల మంది బాలింతలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నట్లు అధికారులు తెలిపారు.

తల్లీ – శిశువుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి వాహనంలో సీటు బెల్టులు, బాలింతలు సులభంగా ఎక్కేందుకు ఫుట్‌రెస్ట్, ఎయిర్ కండిషనింగ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేశారు. అదనంగా జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమర్చడం ద్వారా వాహనాల రియల్‌టైమ్ పర్యవేక్షణకు అవకాశం కల్పించారు.

వాహనాల నిర్వహణ, సేవల అమలు విధానం, రాష్ట్రవ్యాప్తంగా విస్తరణపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అధికారిక స్టిక్కరింగ్ పూర్తయిన అనంతరం అన్ని జిల్లాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *