
రైలు ప్రయాణం అంటేనే ఒక సందడి.. ముఖ్యంగా ఇంటి నుంచి వండుకు వచ్చిన భోజనాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం మనందరికీ అలవాటు. అయితే ఇకపై అలా భోజనం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు తిన్న భోజనం కంటే మీరు చెల్లించే జరిమానానే చాలా ఖరీదైనదిగా మారుతుంది. రైల్వే ప్రాంగణాల్లో, రైలు బోగీల్లో పరిశుభ్రత విషయంలో భారతీయ రైల్వే ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది.
ఒక్కరోజే రూ.2.89 లక్షల జరిమానా
రైల్వే స్టేషన్లను, రైళ్లను క్లీన్‌గా ఉంచేందుకు రైల్వే శాఖ క్లీన్ రైల్వే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఇందులో భాగంగా కేవలం ఒక్క రోజులోనే వివిధ రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించగా.. ఏకంగా 1,447 మంది నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి రైల్వే అధికారులు మొత్తం రూ.2,89,400 జరిమానా వసూలు చేశారు. అంటే సగటున ప్రతి ఒక్కరి నుంచి రూ.200 వరకు ఫైన్ వసూలు చేస్తున్నారన్నమాట.
ఫ్యామిలీతో కలిసి తిన్నారా? చెత్త అక్కడే పడేశారా?
ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఇంట్లో వండిన ఆహారాన్ని రైలులో తిని, ఆ తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను, ప్లాస్టిక్ కవర్లను తమ సీట్ల కింద పారవేశారు. ఇది గమనించిన రైల్వే సిబ్బంది తక్షణమే వారికి భారీ జరిమానా విధించారు. మీరు భోజనం ఎక్కడిది తిన్నా పర్వాలేదు.. కానీ చెత్తను మాత్రం డస్ట్‌బిన్‌లోనే వేయాలి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రైల్వే శాఖ హెచ్చరికలు
రైల్వే ప్రాంగణాల్లో సీసీటీవీ కెమెరాలు, సివిల్ డ్రెస్‌లో ఉన్న సిబ్బంది ప్రయాణికుల కదలికలను గమనిస్తుంటారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం వల్ల పర్యావరణానికే కాకుండా.. ఇతర ప్రయాణికుల ఆరోగ్యానికి కూడా ముప్పు కలుగుతుంది. రైల్వే ఆక్ట్ ప్రకారం రైల్వే ప్రాంగణాలను అపరిశుభ్రం చేయడం శిక్షార్హమైన నేరం. మీరు భోజనం చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను ఒక కవర్‌లో వేసి, మీ బోగీ చివరన ఉండే డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయండి. తద్వారా మీ ప్రయాణం హాయిగా ఉండటమే కాకుండా మీ జేబుకు కూడా చిల్లు పడదు.
