Mudragada Padmanabham Political Journey: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్ను మూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. బుధవారం సాయంత్రం ముద్రగడ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా.. మాజీ సీఎంలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలిపారు. ముద్రగడ మరణ వార్తతో కిర్లంపూడిలోని ఆయన ఇంటికి అభిమానులు భారీగా చేరుకున్నారు. ముద్రగడ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం..
1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ జన్మించారు. 1967లో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. పద్మనాభం తండ్రి వీర రాఘవరావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1962, 1967లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యునిగా గెలుపొందారు. 1977లో తండ్రి ఆకస్మిక మృతితో, సన్నిహితుడైన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సూచనతో 25వ ఏట ముద్రగడ జనతాపార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రత్తిపాడు నుంచి 1978లో జనతాపార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ముద్రగడ గెలుపొందారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీచేసి శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆకస్మికంగా పదవికి రాజీనామా చేశారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీతో కలిసి కత్తిపూడిలో బహిరంగ సభ పెట్టి ముద్రగడ.. కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఆ పార్టీ తరఫున గెలిచి మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1994లో ప్రత్తిపాడు నుంచి బరిలో దిగి ఓటమి చవిచూశారు. 1999లో తెదేపాలో చేరి కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు.
2004 నుంచి..
2004లో మరోసారి ఎంపీగా పోటీచేసినా ఓడిపోయారు. 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కాగా కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా ఉన్నారు.
ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు..
కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో తుని వేదికగా కాపు ఐక్య గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న రైలు దహనం ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
