
వివాహాల సంఖ్య పడిపోతున్న తరుణంలో, వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి బ్యాంకులను, నైట్‌క్లబ్‌లను కూడా రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మార్చింది ప్రభుత్వం. కేవలం సివిల్ అఫైర్స్ కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లలో ఆ దేశం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.
భాగస్వామి ఫిక్సయితే చాలు.. స్పాట్‌లోనే పెళ్లి..
చైనా యువతలో పెళ్లిళ్లపై ఆసక్తి సన్నగిల్లుతుండటంతో, వివాహాల నమోదు ప్రక్రియను చైనా ప్రభుత్వం మరింత సులువు చేసింది. క్షీణిస్తున్న వివాహాల రేటును తిరిగి గాడినెక్కించేందుకు అధికారులు అమలు చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది.
తియాంజిన్ నగరంలోని ‘పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్’ శాఖ తొలిసారిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని, షాండోంగ్ ప్రావిన్స్‌లోని ఓ మాతా-శిశు సంరక్షణ కేంద్రం ఈ సేవలను ప్రారంభించింది. వివాహ రిజిస్ట్రేషన్‌తో పాటు, ప్రీ-మ్యారేజ్ హెల్త్ చెకప్‌లు, ఫెర్టిలిటీ కౌన్సెలింగ్‌ను ఒకే వేదికపై అందిస్తుండటంతో నూతన జంటలకు ఎంతో సమయం ఆదా అవుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నైట్ క్లబ్స్, మెట్రో, ఎయిర్ పోర్ట్స్ ఎక్కడైనా మీ ఇష్టం!
గ్వాంగ్‌జౌ బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే తొలిసారిగా మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేసే ఎయిర్‌పోర్టుగా అవతరించింది. ఇక్కడ వివాహం నమోదు చేసుకున్న జంటలకు విమానాల రాకపోకలను తిలకించేందుకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. ఇక బీజింగ్, నాంజింగ్ నగరాల్లోని పురాతన ఆలయాలతో పాటు, హెఫీలో ఒక మెట్రో స్టేషన్ కూడా ఈ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించాయి. మరోవైపు షాంఘైలోని ఓ నైట్ క్లబ్ స్థానిక అధికారులతో భాగస్వామ్యం కుదుర్చుకుని, నేరుగా తమ వద్దే మ్యారేజ్ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటును కల్పిస్తోంది.
మరోవైపు, వివాహ రిజిస్ట్రేషన్ నిబంధనలను చైనా ప్రభుత్వం గత ఏడాదే సరళీకరించింది. దీని ప్రకారం నూతన జంటలు తమ సొంతూరుతో పనిలేకుండా దేశంలో ఎక్కడైనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ఇకపై నివాస ధ్రువీకరణ పత్రం (హుకూ) సమర్పించాల్సిన పనిలేదు. ఈ నిబంధనల సడలింపుతో దేశవ్యాప్తంగా దాదాపు 500కి పైగా ప్రభుత్వేతర కేంద్రాలు, 1,300కు పైగా ప్రైవేటు ఏజెన్సీలు తమ కేంద్రాల్లోనూ మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలిస్తున్న అధికారులు, అర్హత ఉన్న వాటికి సర్టిఫికెట్లు జారీ చేసే అధికారాలను మంజూరు చేస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకునే వారికి ఇళ్ల కొనుగోళ్లలో రాయితీలు, పన్ను మినహాయింపులు ప్రకటించారు. పిల్లలను కనే వారికి ఆర్థిక సాయం వంటి పథకాలను స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
వివాహ నిబంధనలను ప్రభుత్వం సడలించిన తొలి రోజుల్లో రిజిస్ట్రేషన్లు కొద్దిగా ఊపందుకున్నప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో మాత్రం ఈ సంఖ్య మళ్లీ 7.5 శాతం మేర క్షీణించింది. అయితే, వివాహాలను ప్రోత్సహించేందుకు అధికారులు అనుసరిస్తున్న ఈ వినూత్న పద్ధతులపై సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది. పెళ్లిళ్లకు దూరంగా ఉండటానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న క్లిష్టత కారణం కాదని, భవిష్యత్తుపై నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, బాధ్యతల పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతామనే భయమే యువతను వెనక్కిలాగుతోందని నెటిజన్లు బలంగా వాదిస్తున్నారు
నేటి యువత వివాహం, కుటుంబ బాధ్యతల కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు, కెరీర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతపై ఆర్థిక భారం పెరగడం, ఉద్యోగాల్లో అనిశ్చితి వల్ల పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. చైనాలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా వివాహాలపై ప్రభావం చూపుతోంది.
