హైదరాబాద్ మహానగరం ఐటీ, పారిశ్రామిక రంగంలో మరో మైలురాయి సాధించింది. ప్రపంచ ప్రఖ్యాత రసాయన తయారీ దిగ్గజం బాస్ఎఫ్ (BASF) తన కార్యకలాపాలను విస్తరిస్తూ భాగ్యనగరంలో రెండు భారీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను (GCC) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆ సంస్థ తన ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ (LOI)ను అందజేసింది.
జర్మనీకి చెందిన ఈ బహుళజాతి సంస్థ ‘బాస్ఎఫ్ గ్లోబల్ డిజిటల్ హబ్’, ‘గ్లోబల్ సర్వీసెస్ హబ్’ పేరుతో రెండు కేంద్రాలను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఐటీ, డిజిటల్ సర్వీసెస్, కార్పొరేట్ సేవల రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు ఇది గొప్ప వరంగా మారనుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జర్మన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన BASF వంటి సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకోవడం నగరానికి ఉన్న అంతర్జాతీయ క్రేజ్‌కు నిదర్శనం.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యాలను వివరించారు. వచ్చే ఏడాది కాలంలో రాష్ట్రంలో కొత్తగా 100 గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా సుమారు లక్ష మందికి పైగా ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ను కేవలం ఆఫీస్ స్పేస్‌కే పరిమితం చేయకుండా, ఇంజినీరింగ్ మరియు ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సాంకేతిక విప్లవం కోసం ప్రభుత్వం 200 ఎకరాలతో చేపట్టిన AI సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, క్వాంటమ్ హబ్, మAIKAM వంటి ప్రాజెక్టులు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి దిగ్గజాలు కొలువుదీరిన హైదరాబాద్‌లో.. ఇప్పుడు BASF చేరడంతో నగరం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
