మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నడిరోడ్డుపై ఒక మహిళపై కొడవలితో జరిగిన కిరాతక హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మహిళను వెంబడించి మరీ కొడవలితో వేటు వేయడం స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్నేహల్ సావంత్ అనే మహిళ పనిచేస్తోంది. బోయిసార్‌లోని గోల్డెన్ సినిమా థియేటర్ సమీపంలో ఆమె వెళ్తుండగా.. అమోల్ ములే అనే వ్యక్తి ఒక్కసారిగా కొడవలితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. ప్రాణభయంతో ఆమె కేకలు వేస్తున్నా వినకుండా కిరాతకంగా వేట్లు వేశాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి..
ఈ ఘోర దాడిలో స్నేహల్ సావంత్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆమెను బోయిసార్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ దారుణ ఘటనకు వన్‌సైడ్ లవ్ లేదా వ్యక్తిగత కక్షలు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు అమోల్ ములే, స్నేహల్ సావంత్‌ను గత కొంతకాలంగా వేధిస్తున్నాడా? లేదా మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్పీ రంగంలోకి.. ప్రత్యేక బృందాలతో గాలింపు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పాల్ఘర్ జిల్లా ఎస్పీ యతీష్ దేశ్‌ముఖ్ ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని స్వయంగా పరిశీలించిన ఎస్పీ.. కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుడు అమోల్ ములేను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అతడి కదలికలను ట్రాక్ చేస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
