తాజావార్తలు

Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన గాలిదుమారం.. కుప్పకూలిన 120 ఏళ్ల దేవతా వృక్షాలు..

Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన గాలిదుమారం.. కుప్పకూలిన 120 ఏళ్ల దేవతా వృక్షాలు..


మార్కాపురం పరిసర ప్రాంతాల్లో గాలిదుమారంతో కూడిన వర్షం పంజా విసిరింది. యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. హఠాత్తుగా మారిన వాతావరణంతో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మిట్టపాలెం సమీపంలో ప్రధాన రహదారిపై ఒక భారీ వృక్షం విరిగిపడటంతో, త్రిపురాంతకం – యర్రగొండపాలెం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయంలో విషాదం

ఈ గాలివాన బీభత్సానికి గిద్దలూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఒక ఘోరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయ ఆవరణలో ఉన్న 120 సంవత్సరాల నాటి భారీ దేవతా వృక్షాలు ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రాణాపాయం తప్పిందని, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

శివపార్వతుల బంధం.. భక్తుల గుండె కోత

ఈ వృక్షాలకు గిద్దలూరు ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాదాపు 120 ఏళ్ల క్రితం ఈ ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు, వేపచెట్టు ఒకదానికొకటి పెనవేసుకుని పుట్టాయి. అప్పటినుంచి స్థానిక ప్రజలు, భక్తులు ఈ వృక్షాలను సాక్షాత్తూ ‘శివపార్వతుల’ స్వరూపాలుగా భావిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో నిత్యం పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఒక శతాబ్దానికి పైగా పూజలందుకున్న ఈ పవిత్ర వృక్షాలు ఉన్నట్టుండి నేలకొరగడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

అశుభంగా భావిస్తున్న ప్రజలు

ఆలయ ప్రాంగణంలో నూరేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ దేవతా వృక్షాలు అకస్మాత్తుగా కూలిపోవడాన్ని స్థానిక ప్రజలు, భక్తులు తీవ్రమైన ‘అశుభం’గా భావిస్తున్నారు. ఈ ఘటనతో గిద్దలూరు పట్టణంలో ఒక రకమైన ఆందోళన, సెంటిమెంట్ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు, స్థానిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కూలిపోయిన వృక్షాలను తొలగించే పనులను చేపట్టారు. అలాగే రోడ్లపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *