
ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఘోరం జరిగింది. ధర్మవరం గ్రామంలో ఆర్‌ఎంపిగా ప్రాక్టీస్ చేస్తున్న మేడగం కోటిరెడ్డి అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. భార్య కళ్ల ముందే కోటిరెడ్డిని ప్రాణాలు తీశారు. అక్రమ సంబంధం కోణంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో ధర్మవరం గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆర్‌ఎంపి మేడగం కోటిరెడ్డి ఇంట్లో అర్ధరాత్రి వేళ మృత్యువు తాండవించింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగులు, తాము ఆనారోగ్యంతో ఉన్నామని, అర్జంట్‌గా వైద్యం చేయాలని కోరుతూ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న భార్యాభర్తలపై కారం కొట్టారు. అనంతరం కోటిరెడ్డి భార్యను తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కారు. ఆమె కళ్ళముందే కోటిరెడ్డిపై కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ పరిణామంతో కోటిరెడ్డి భార్య స్పృహ కోల్పోయింది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
వివాహేతర సంబంధమే కారణమా..?
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ హత్య వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గ్రామంలో ఈ హత్య వార్త తెలియడంతో ప్రజలు గుంపులు గుంపులుగా చేరి భయాందోళనతో చర్చించుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న అద్దంకి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న సిసి కెమెరాల విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దర్శి డిఎస్‌పి బాలమురళీకృష్ణ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
