
పన్ను రిటర్న్ దాఖలు సమయంలో కొన్ని ఆదాయాలను మర్చిపోవడం లేదా పొరపాట్లు చేయడం సాధారణమే. అయితే అలాంటి లోపాలను సరిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందించిన ITR-U (Updated Income Tax Return) విధానం ఇంకా అందుబాటులో ఉంది. మార్చి 31 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను పునఃసమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సెక్షన్ 139(8A) కింద అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం ద్వారా, పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లోని పొరపాట్లను సరిచేయవచ్చు లేదా చూపని ఆదాయాన్ని ప్రకటించవచ్చు.
అంతేకాకుండా ఇంతకు ముందు రిటర్న్ దాఖలు చేయని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత గరిష్టంగా 48 నెలలలోపు ITR-U దాఖలు చేయడానికి అనుమతి ఉంది. ఉదాహరణకు AY 2021–22కు గడువు మార్చి 31, 2026 కాగా, AY 2025–26కు ఈ గడువు 2030 వరకు ఉంటుంది. ఈ సౌకర్యం ప్రతి పన్ను చెల్లింపుదారుకు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని పరిమితులు ఉన్నాయి. నిల్ లేదా లాస్ రిటర్న్‌ల కోసం ITR-U ఉపయోగించలేరు. అలాగే ఇది పన్ను బాధ్యతను తగ్గించే లేదా అధిక రీఫండ్ పొందే విధంగా ఉండకూడదు. సోదాలు, స్వాధీనం లేదా విచారణలు ఇప్పటికే ప్రారంభమైన కేసుల్లో కూడా ఈ ఎంపిక అందుబాటులో ఉండదు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే ITR-U దాఖలు చేయడానికి సాధారణ పన్ను, వడ్డీతో పాటు అదనపు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యాన్ని బట్టి ఈ అదనపు పన్ను 25 శాతం నుంచి 70 శాతం వరకు పెరుగుతుంది. మొదటి 12 నెలల్లో ఫైల్ చేస్తే 25 శాతం, 24 నెలల్లో 50 శాతం, 36 నెలల్లో 60 శాతం, 48 నెలల లోపు అయితే 70 శాతం వరకు అదనపు భారం పడుతుంది. మొత్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సమీక్షించి, తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే అధిక పన్ను భారం లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
