
అనంతపురం జిల్లా ఉరవకొండలో మగ్గంపై నేసిన పట్టు చీరను ఉగాది పండుగ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుకోవడంతో.. ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం దక్కిందంటున్నారు చేనేత కార్మికులు.
మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ తరపున మగ్గంపై నేసిన పట్టుచీరలను అందించేందుకు ఉరవకొండ చేనేత కార్మికులకు 30 పట్టుచీరలు నేయాల్సిందిగా చేనేత జోలి శాఖ కమిషనర్ రేఖారాణి విజ్ఞప్తి చేశారు. 30 పట్టుచీరలు మగ్గాలపై నేసేందుకు అవసరమైన ముడిసరుకు, మెటీరియల్ ను ఉరవకొండ చేనేత కార్మికులకు అందించారు.
30 పట్టుచీరల్లో నవదుర్గ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి కేంద్రంలో మగ్గం పై టెంపుల్ కుట్టు విత్ బార్డర్ తో నేసిన పట్టుచీర అందరినీ ఆకర్షించింది. దీంతో రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి గత 7 డిసెంబర్లో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టెంపుల్ కుట్టు విత్ బార్డర్ తో కూడిన పట్టుచీరను అందజేశారు. ఆ చీరనే ఉగాది పండుగ రోజు అయోధ్య రామ మందిరంలో పూజకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధరించారు. ఎక్కడో మారుమూల ఉరవకొండ మగ్గాలపై చీరను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధరించడంతో ఉరవకొండ చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత అద్భుతమైన చీరలు నేసి రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకొస్తాం అంటున్నారు అనంత చేనేత కార్మికులు.
