
ఎటూ కానట్టు ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న వడగంట్ల వాన రైతులు వేసిన పంటలను నాశనం చేశాయి. మెదక్ , సంగారెడ్డి, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అకాల వానలతో అపార పంట నష్టం జరిగింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఏటుగా పెరిగిన పంట అకాల వర్షం,ఈదురు గాలుల ధాటికి ఇలా కుప్పకూలింది. చెట్టుపైన మచ్చుకైనా లేకుండా మామిడి కాయలు నేలరాలాయి. మొక్క కూడా మిగలకుండ జొన్నచేను వాలిపోయింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇది పరిస్థితి
అటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. జోరు వానకు జొన్నచేన్లు ధ్వంసమయ్యాయి. మామిడి, టమాట ఇలా అన్ని పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశం మెఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఈ కారణంగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పంటల నీట మునిగింది.
కామారెడ్డిలో దంచికొట్టిన వర్షం
ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉరుములు,మెరుపులు ఈదురు గాలులతో అకాల వర్షం దంచి కొట్టింది.గాంధారి, జుక్కల్ మండలాలలో ఈదురు గాలులకు జొన్న, మొక్కజొన్న, కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. ఇక వరి రైతులదయితే రగోసే అని చెప్పాలి. చేతికందాల్సిన పంట అకాల వానతో తుడిచి పెట్టుకుపోయింది. కనీసం పెట్టుబడయినా వచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు రైతులు.
హైదరాబాద్‌ను సైతం ఊపేసిన వాన
ఓవైపు పంట నష్టం మరోవైపు ఉరుములు పిడుగుల బీభత్సం. వికారాబాద్ జిల్లా తాండూరు గాలివాన గత్తర రేపింది.అర్ధరాత్రి వరకు వాన దంచికొడుతూనే ఉంది. పిడుగుపడ్డంతో ఓ చెట్టుకూలింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో తాండూరు చీకట్లో మగ్గింది. ఇటు హైదరాబాద్‌లోనూ అర్థరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
