
సినిమా రంగంలో ట్రెండ్ సెట్టర్ గా పేరుగాంచిన ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో ఉంటారు. క్రైమ్ థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలతోనే కాకుండా, హర్రర్ సినిమాలతో ప్రేక్షకులను వెరైటీగా భయపెట్టడంలో ఆయన దిట్ట. తాజాగా ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్, తన కెరీర్‌లోని క్లాసిక్ హర్రర్ మూవీ ‘భూత్’ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్ ఎంపిక వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టిన ఆ దర్శకుడు మరెవరో కాదు.. రామ్ గోపాల్ వర్మ.
ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ వల్లే..
“రంగీలా సినిమాలోని ‘హై రామ’ పాటలో ఉర్మిళ ఎరుపు రంగు దుస్తులు ధరించి జాకీ ష్రాఫ్ వైపు చాలా ఇంటెన్సివ్‌గా చూస్తుంది. ఆ పాటలోని ఆమె కళ్లలోని తీవ్రత నా మైండ్‌లో బలంగా నాటుకుపోయింది. ఆ ఒక్క క్లోజప్ షాట్ చూసినప్పుడే, భూత్ సినిమాలో అలాంటి పవర్ఫుల్ పాత్రను ఆమె మాత్రమే చేయగలదని నేను నిర్ణయించుకున్నాను” అని వర్మ తెలిపారు. ఉర్మిళతో మళ్ళీ సినిమా చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన ప్రస్తుతానికి లేదని సమాధానమిచ్చారు. ‘సత్య’ నుంచి ‘ఏక్ హసీనా థీ’ వరకు ఆమెతో అన్ని రకాల జోనర్లు చేసేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.
Rangeela
కథ అవసరం లేదు..
ఆర్జీవీ హర్రర్ సినిమాల గురించి మాట్లాడుతూ.. “ఒక హర్రర్ సినిమాకు ఎక్కువ కథ ఉండకూడదు. కథ పెరిగేకొద్దీ భయం తగ్గుతుంది. ది ఎక్సోర్సిస్ట్, ది కంజురింగ్ వంటి సినిమాల్లో కథ కంటే వాతావరణమే ఎక్కువగా భయపెడుతుంది” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ‘భూత్’ సినిమాను మొదట ఒక పాత హవేలీలో తీయాలనుకున్నానని, కానీ భయం అనేది మన పక్కింట్లో కూడా జరగవచ్చని అనిపించేలా ఉండాలని ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో షూట్ చేశానని చెప్పారు.
ఆర్జీవీ, మనోజ్ బాజ్పేయీ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక అంచనా ఉంటుంది. వీరిద్దరూ కలిసి త్వరలో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే హర్రర్ కామెడీ సినిమాతో రాబోతున్నారు. మే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వర్మ ప్రకటించారు. ‘సత్య’, ‘కౌన్’ వంటి చిత్రాల తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటం విశేషం. ఆర్జీవీ మాటల్లో చెప్పాలంటే, హర్రర్ అంటే ఎదుటివారిని భయపెట్టడాన్ని ప్రేమించడం. తక్కువ శబ్దం, ఎక్కువ నటుల హావభావాలతో భయాన్ని పండించడంలో ఆయన సిద్ధహస్తుడు. త్వరలో రాబోతున్న ఆయన కొత్త చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.
