తాజావార్తలు

Indian Railways: రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే..


రైలు ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో చెత్త వేస్తే ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే తాజాగా పరిశుభ్రత నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైల్వే ఆస్తులను పాడు చేయడం వంటి చర్యలకు విధించే గరిష్ఠ జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కి పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 24న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చాయి. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలను పరిశుభ్రతను పెంచే లక్ష్యంతో భారత రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏయే పనులకు జరిమానా?

రైల్వే ప్రాంగణాలు, ప్లాట్‌ఫారాలు లేదా రైలు బోగీల్లో నిర్ణయించిన ప్రదేశాలు కాకుండా ఇతర చోట్ల చెత్త వేయడం లేదా వదిలేయడం నిషేధించబడింది. అలాగే అనుమతి లేకుండా రైలు బోగీలపై పోస్టర్లు అంటించడం, రాయడం, గీయడం లేదా రైల్వే ఆస్తులను దెబ్బతీయడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు.

రైల్వే ప్రాంగణాల్లో అనుమతించిన సదుపాయాలు లేకుండా వంట చేయడం, స్నానం చేయడం, ఉమ్మివేయడం, మూత్ర విసర్జన, మల విసర్జన, జంతువులు లేదా పక్షులకు ఆహారం పెట్టడం, వాహనాలు, పాత్రలు, దుస్తులు కడగడం, వస్తువులను నిల్వ చేయడం వంటి కార్యకలాపాలపైనా నిబంధనలు ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో పనిచేసే అధికారిక విక్రేతలు, హాకర్లు కూడా చెత్త వేయడానికి డస్ట్‌బిన్లు లేదా వ్యర్థాల కంటైనర్లను ఏర్పాటు చేసి, చెత్తను సక్రమంగా పారవేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి



జరిమానా చెల్లించకపోతే?

రైల్వే విధించిన రూ.1,000 జరిమానాను చెల్లించకపోతే సంబంధిత వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశముంది. న్యాయస్థానం రూ.2,000 వరకు అదనపు జరిమానా విధించే అవకాశం ఉంది.

జరిమానా వసూలు అధికారం ఎవరెవరికి..?

నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జరిమానా వసూలు చేసే అధికారం కొంతమంది రైల్వే అధికారులకు ఉంది. స్టేషన్ మాస్టర్లు, స్టేషన్ మేనేజర్లు, కమర్షియల్ విభాగానికి చెందిన టికెట్ కలెక్టర్లు, ఆపరేటింగ్ విభాగంలోని సమాన స్థాయి అధికారులు, రైల్వే పరిపాలన అనుమతించిన ఇతర అధికారులు జరిమానా వసూలు చేయడానికి అధికారం కలిగి ఉంటారు. ప్రయాణికులు రైల్వే ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ సూచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *