తాజావార్తలు

రాళ్లలో కూడా ఆడా, మగ అనే తేడా ఉంటుందని తెలుసా? వాటిని ఎలా గుర్తించాలంటే?

రాళ్లలో కూడా ఆడా, మగ అనే తేడా ఉంటుందని తెలుసా? వాటిని ఎలా గుర్తించాలంటే?


సాధారణంగా మనుషుల్లో, జంతువుల్లో ఆడా, మగ అనే తేడా ఉంటుందని అందరికీ తెలిసిందే. అంతెందుకు చెట్లలో కూడా తేడా ఉంటుంది. కానీ రాళ్లలో కూడా ఆడా, మగ రాళ్లు ఉంటాయని తెలుసా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మరీ ముఖ్యంగా దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాల కోసం శిలలను ఎంపిక చేసేటప్పుడు ఈ విషయాన్ని కచ్చితంగా పరిశీలిస్తారు. శిల ఆడదా? మగదా? అనే విషయాన్ని నిర్ధారించుకున్నాకే వాటిని విగ్రహాల తయారీకి వినియోగిస్తారు. నిజానికి దేవాలయాల్లో ప్రతిష్ఠించే దేవతా విగ్రహాల తయారీ అనేది కేవలం రాతిని చెక్కే కళ మాత్రమే కాదు. దీనికి వేల ఏళ్ల చరిత్ర కలిగిన శిల్పశాస్త్రం, ఆగమ సంప్రదాయాలు ఆధారంగా ఉంటాయి. విగ్రహాల కోసం ఉపయోగించే శిలలను వాటి ధ్వని, ఆకారం, గుణాల ఆధారంగా ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. శిల్పశాస్త్రంలో ఈ శిలలను పురుష శిల, స్త్రీ శిల, నపుంసక శిలలుగా వర్గీకరించడం విశేషం.

శిల్ప నిపుణుల వివరాల ప్రకారం.. శిలను తట్టినప్పుడు వచ్చే ధ్వని ఆధారంగా దాని స్వభావాన్ని గుర్తిస్తారు. కంచు గంట మోగినట్లు గంభీరమైన, దీర్ఘమైన శబ్దం వస్తే దానిని పురుష శిలగా పరిగణిస్తారు. ఇలాంటి శిలలతో వెంకటేశ్వర స్వామి, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి వంటి పురుష దేవతల విగ్రహాలను రూపొందిస్తారు. అదే విధంగా ఇత్తడి గంట ధ్వనిని పోలిన మృదువైన శబ్దం వస్తే దానిని స్త్రీ శిలగా భావిస్తారు. ఈ శిలలతో సీతాదేవి, మహాలక్ష్మి, ఆండాళ్‌ వంటి దేవతామూర్తులను చెక్కుతారు. డప్పు మోగినట్లు నిస్సారమైన శబ్దం వస్తే దానిని నపుంసక శిలగా గుర్తిస్తారు. ఈ రకమైన శిలలు విగ్రహాల తయారీకి అనుకూలం కావని శిల్పశాస్త్రం పేర్కొంటుంది. అయితే వీటిని దేవాలయ పీఠాలు, ఆధార నిర్మాణాలు, నేల నిర్మాణం వంటి అవసరాలకు వినియోగిస్తారు.

శిల ఎంపికలో కఠినమైన ప్రమాణాలు పాటిస్తారు. రాయి ఏకవర్ణంగా ఉండాలి. నల్ల రాయి అయితే పూర్తిగా నలుపు రంగులోనే ఉండాలి. మచ్చలు, గీతలు, పొరలు, సారలు లేదా పగుళ్లు ఉండకూడదు. శిలను ఎంపిక చేసిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగి, దానిలో అంతర్గత లోపాలు ఉన్నాయా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలిస్తారు. చిన్న పగుళ్లు ఉన్నా అలాంటి శిలలను విసర్జిస్తారు. ఎందుకంటే అభిషేకాల సమయంలో నీరు లోపలికి చేరి భవిష్యత్తులో విగ్రహం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఆగమశాస్త్ర పండితుల ప్రకారం.. శిలలకు పురుష, స్త్రీ, నపుంసక అనే పేర్లు పెట్టడం జీవుల లింగభేదాన్ని సూచించదు. అవి శిలల ధ్వని, గుణం, స్వభావాన్ని తెలియజేసే సాంకేతిక పదాలు మాత్రమే. శిలలోని నాదం, శక్తి, నిర్మాణ లక్షణాలను బట్టి ఈ వర్గీకరణ రూపొందించబడింది.

నాణ్యమైన కృష్ణశిలలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరిమితంగా లభిస్తున్నాయి. తమిళనాడులోని కంచిపురం, తిరుచ్చి సమీప ప్రాంతాల్లోని క్వారీల నుంచి ఎక్కువగా శిలలను సేకరిస్తున్నారు. దేవాలయాల కోసం తయారయ్యే విగ్రహాల వెనుక శిల ఎంపిక నుంచి శిల్ప నిర్మాణం వరకు ప్రతి దశలో శాస్త్రం, సంప్రదాయం, నైపుణ్యం కలిసి పనిచేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *