తాజావార్తలు

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!


Dr. Subrahmanyam Jaishankar

రష్యా నుంచి భారతదేశం భారీగా చమురు కొనుగోలు చేస్తోందంటూ అమెరికా, పలు యూరోపియన్ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. యూరప్ పర్యటనలో భాగంగా ఫిన్‌లాండ్‌లో జరిగిన ‘కుల్తరంటా టాక్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారతదేశ ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించడమే కాకుండా యూరోపియన్ దేశాల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు.

‘వర్ధమాన శక్తులు మరియు నూతన భౌగోళిక రాజకీయ పోటీ’ అనే అంశంపై జరిగిన చర్చలో ఒక విలేకరి భారత్ రష్యాపై అధిక సానుభూతి చూపుతోందని, రష్యా చమురు కొనుగోళ్లపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తోందని ప్రశ్నించారు. దీనికి స్పందించిన జైశంకర్, భారత్ ధరలు, లభ్యత ఆధారంగానే చమురును కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రష్యా చమురు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండటంతో భారత్ ఆ అవకాశాన్ని వినియోగించుకుందని తెలిపారు.

అదే సమయంలో యూరప్ దేశాల చారిత్రక వైఖరిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. భారతదేశంపై దాడులకు ఉపయోగపడే ఆయుధాలను కొన్ని యూరోపియన్ దేశాలు ఇతర దేశాలకు విక్రయిస్తున్నాయని గుర్తు చేశారు. “ఏ యూరోపియన్ దేశంపైనా భారత ఆయుధాలతో దాడి జరగలేదు. కానీ భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధాలు యూరప్ నుంచి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి” అని జైశంకర్ వ్యాఖ్యానించారు.

2022లో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్‌ను స్థిరంగా ఉంచడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు రష్యా చమురును కొనుగోలు చేయాలని అమెరికా కూడా అప్పట్లో భారత్‌ను ప్రోత్సహించిందని వెల్లడించారు. తరువాత అదే దేశాలు విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.

వీడియో ఇక్కడ చూడండి..

అంతర్జాతీయ రాజకీయాల్లో సూత్రాలు, నైతికతల పేరుతో మాట్లాడుతున్న దేశాలు తమ ప్రయోజనాల కోసం విధానాలను మార్చుకుంటున్నాయని జైశంకర్ అన్నారు. “మేమూ ప్రపంచ రాజకీయాలను అర్థం చేసుకునే వారమే. ఏది జాతీయ ప్రయోజనమో దానినే భారత్ ముందుంచుతుంది” అని స్పష్టం చేశారు. జైశంకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ వేదికల్లో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *