తెలుగు సినీ యవనికపై ఎన్టీఆర్-జయప్రద కాంబినేషన్ అంటే ఒక అద్భుతం. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు, పాటలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. జయప్రద ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, నటనే ఊపిరిగా జీవించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఎదుటివారికి ఇచ్చే గౌరవం. “ఆయన ఎవరినీ కూడా ఏకవచనంతో (నువ్వు అని) పిలవడం నేనెప్పుడూ చూడలేదు” అని జయప్రద గుర్తు చేసుకున్నారు. సెట్ బాయ్ నుంచి స్టార్ హీరోయిన్ వరకు ఎవరినైనా 'తమరు' లేదా 'మీరు' అని మాత్రమే పిలిచేవారని అన్నారు.
ఆయన ఏ మూడ్‌లో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా కూడా తన సంస్కారాన్ని వీడేవారు కాదని, తనను కూడా 'జయప్రద గారు' అని గౌరవంగా పిలిచేవారని ఆమె తెలిపారు. ఆయన క్రమశిక్షణ గురించి చెబుతూ జయప్రద ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచి, 3 గంటల కల్లా వ్యాయామం పూర్తి చేసుకునేవారు అని చెప్పుకొచ్చారు. పూజా కార్యక్రమాలు ముగించుకుని, షూటింగ్ 7:30 కి అంటే సరిగ్గా ఐదు నిమిషాల ముందే సెట్లో ఉండేవారు. అప్పటికి యూనిట్ సభ్యులు కూడా వచ్చి ఉండేవారు కాదని, ఆయన ఒక కుర్చీ వేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఉండేవారని ఆమె తెలిపారు.
నటన పట్ల ఆయనకున్న అంకితభావం అనితరసాధ్యం. పౌరాణిక పాత్రల కోసం భారీ కిరీటాలు, విగ్గులు ధరించినప్పుడు, షూటింగ్ బ్రేక్‌లో కూడా వాటిని తొలగించేవారు కాదు అని అన్నారు. “మనం అయితే కాసేపు కిరీటం తీసి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం, కానీ ఆయన మాత్రం 24 గంటలు ఆ గెటప్‌లోనే ఉండేవారు” అని జయప్రద అన్నారు. తనే ఆ పాత్రగా మారి జీవం పోయడం ఎన్టీఆర్ కే సాధ్యమని ఆమె గుర్తు చేసుకున్నారు. కృష్ణుడు, దుర్యోధనుడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఏ పాత్ర చేసినా దానికి నిండుతనాన్ని తీసుకువచ్చిన లెజెండ్ ఎన్టీఆర్ . ఆయన నుంచి క్రమశిక్షణ, సమయపాలన మరియు తోటివారిని గౌరవించడం వంటి లక్షణాలను నేటి తరం నేర్చుకోవాలని జయప్రద తెలిపారు. ఆయన నటనకు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నటనకే పాఠాలు నేర్పిన గురువు అని ఆమె చెప్పుకొచ్చారు.
జయప్రద విషయానికి వస్తే.. తెలుగు , హిందీ సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. ఆమె కేవలం నటిగానే కాకుండా, రాజకీయ నాయకురాలిగా కూడా తనదైన ముద్ర వేశారు. 14 ఏళ్ల వయసులోనే 'భూమి కోసం' అనే సినిమాలో ఒక చిన్న డాన్స్ బిట్‌తో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కె. విశ్వనాథ్ 'సిరి సిరి మువ్వ' సినిమా ఆమెకు భారీ బ్రేక్ ఇచ్చింది. గొప్ప దర్శకుడు సత్యజిత్ రే మాట్లాడుతూ.. జయప్రదని “ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ” అని అన్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే 'సర్గమ్' (సిరి సిరి మువ్వ రీమేక్) సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అక్కడ అమితాబ్ బచ్చన్, జితేంద్ర వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్నారు.
సినిమాల్లో శిఖరాగ్రాన ఉన్నప్పుడే ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తర్వాతి కాలంలో ఉత్తరప్రదేశ్‌కు తన రాజకీయ వేదికను మార్చుకుని, సమాజ్ వాదీ పార్టీ తరపున రాంపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా (MP) ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ లో కొనసాగుతున్నారు. సాగర సంగమం, సిరి సిరి మువ్వ, అడవి రాముడు, యమగోల, మేఘసందేశం, దేవత వంటి చిత్రాలు జయప్రద కెరీర్ లో మర్చిపోలేని తెలుగు సినిమాలు. అలాగే సర్గమ్, షరాబీ, సంజోగ్, ఆఖ్రీ రాస్తా గుర్తింపు తెచ్చిపెట్టాయి.





