తాజావార్తలు

మే 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. మార్కెట్ విలువల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

మే 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. మార్కెట్ విలువల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!


భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు..!

తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్‌కు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో భూములు, నివాస, వాణిజ్య భవనాలమార్కెట్ విలువలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ధరలు మే మొదటి వారం నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సవరణ ఇది. గతంలో 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రేట్లు పెరిగాయి. ప్రస్తుత సవరణలో ప్రధానాంశాలు వ్యవసాయ భూములు. ప్రాంతాన్ని బట్టి వ్యవసాయ భూముల విలువ రెండు నుండి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, ప్రస్తుతం ఎకరాకు రూ. 6 లక్షలు ఉన్న ధర, కొత్త సవరణతో రూ. 12 లక్షల నుండి రూ. 18 లక్షల వరకు చేరవచ్చు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని భూమిలకు లెక్కలు వచ్చే అవకాశముంది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకూ మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిసరాల్లో 300 శాతానికి పైగా పెంపును ప్రభుత్వం పరిశీలిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్ (RRR), భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల కారణంగా డిమాండ్ పెరిగిన ప్రాంతాల్లో భూముల విలువలు మూడు రెట్లు పెరగవచ్చు. ఖాళీ ప్లాట్లు, నివాస లేఅవుట్‌ల ధరలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.

పారిశ్రామికాభివృద్ధి – హిల్ట్ (HILT) పాలసీ

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హిల్ట్ పాలసీని వేగవంతం చేయాలని భావిస్తోంది. కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ (ORR) అవతలికి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హిల్ట్ పాలసీని అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అంశంపై రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు కూడా పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. కాలుష్యకారక పరిశ్రమలన్నీంటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలించాలని.. అయితే ఈ అంశలో తాము అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూడీఎల్ పాలసీ కింద భూములను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి అభివృద్ధి చేసుకునే ఆలోచన చేయాలన్నారు.

ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య చైనా తరహాలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు సూచించారు. రాష్ట్రంలో పరిశ్రమలు బాగా నడవాలని.. కాలుష్యం ఉండకూడదు. ఈ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపెన్‌గా ఉన్నదని కమిటీ సభ్యుడు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పనిసరి అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది. మే మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్ల భారం పెరగనుండటంతో, కొనుగోలుదారులు ఇప్పుడే అప్రమత్తమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *