
తీర్థం స్వీకరించే సరైన విధానం..
తీర్థాన్ని స్వీకరించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది, దీనినే ‘గోకర్ణ కృతి’ లేదా ‘గోకర్ణ ముద్ర’ అంటారు. అంటే చేతి వేళ్లను ఆవు చెవి ఆకారంలో ఉంచడం. ఇందుకోసం చూపుడు వేలును బొటనవేలు చివరి భాగాన్ని తాకేలా మడిచి, బొటనవేలిని దానిపై ఉంచాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉండాలి. ఇలా దోసిలి పట్టినట్లుగా ఉంచి, పవిత్ర జలాన్ని అరచేతి మధ్యలో స్వీకరించాలి. తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఎలాంటి శబ్దం చేయకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో తాగాలి. ఇలా చేయడం వల్ల ఆ దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఎన్నిసార్లు తీసుకోవాలి?
సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత మూడుసార్లు తీర్థాన్ని తీసుకుంటాము. అదే దేవాలయాలలో అయితే ఒకసారి స్వీకరించడం పరిపాటి. తీర్థం తీసుకునే సమయంలో “అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం.. సర్వ దురితోపశమనం విష్ణు పాదోదకం శుభమ్” అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రం అర్థం ఏమిటంటే.. ఈ పవిత్ర జలం అకాల మరణాన్ని నిరోధిస్తుంది అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారికి తులసి తీర్థాన్ని ఇవ్వడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు.
తీర్థం తీసుకున్న తర్వాత..
తీర్థం స్వీకరించిన వెంటనే చాలామంది తమ తడి చేతులను తలపై రుద్దుకుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. తీర్థం తీసుకున్న తర్వాత చేతులను తలపై రుద్దడం వల్ల ఆ పవిత్రతకు భంగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దీనికి బదులుగా, రెండు అరచేతులను ఒకదానికొకటి రుద్దుకోవాలి లేదా ఆ చేతులతో కళ్లను అద్దుకోవాలి. పవిత్ర జలాన్ని సేవించిన తర్వాత మనస్సును ఏకాగ్రతతో ఉంచడం ద్వారానే ఆరాధన ఫలితాలు దక్కుతాయి. కాబట్టి, ఇకపై మీరు తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఈ చిన్న నియమాలను పాటించి పూర్తి పుణ్యఫలాన్ని పొందండి.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన మతపరమైన విశ్వాసాల ఆధారంగా అందించబడింది. దీనిపై మరిన్ని వివరాల కోసం ధర్మశాస్త్ర నిపుణులను సంప్రదించవచ్చు.
