
ఏపీలో మంచినీటి సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా జల జీవన్ మిషన్ 2.0 అమలుపై దృష్టి పెట్టింది. ఈ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమం అమలుపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకం చేశాయి. ఢిల్లీలో ఈ కార్యక్రమం జరగ్గా.. సీఎ చంద్రబాబు సచివాయలంలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. హర్ ఘర్ జల్ సాకారం చేసేలా ఈ ఎంవోయూ జరిగినట్లు చంద్రబాబు తెలిపారు. 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నిరంతర తాగునీటి సరఫరా
నిరంతరంగా తాగునీటి అందించేందుకు ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. గతంలో జల్ జీవన్ మిషన్ పథకం ఉండగా.. దీనిని 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటికి తాగునీటి సౌకర్యం అందించడమే ఈ పథకం లక్ష్యం. చాలా గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి సౌకర్యం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం జల జీవన్ మిషన్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా తాగునీటి కష్టాలను తొలగించాలనే లక్ష్యం పెట్టుకుంది. అందుకునుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. ఈ మిషన్ అమలు చేసేందుకు ముందుకొచ్చే రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వాటా కొంత ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధులు కేటాయించి పథకం అమలు చేయాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలు ఈ పథకం అమలు చేసేందుకు ముందుకొచ్చాయి.
కేంద్రం నుంచి సహకారం
జల జీవన్ మిషన్ 2.0 అమలుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చినట్లు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. తొలి విడతలో 16 కోట్ల మంది ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఇచ్చామని, మరో 3 కోట్ల ఇళ్లకు అందించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టులో ఉన్న కొన్ని లోపాలను సవరించిన తర్వాత చేపడతామని తెలిపారు. దాదాపు 9 కోట్ల మంది మహిళలకు నీటి సమస్య తప్పుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. 2028 నాటికి రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కీలక అడుగు అని అభివర్ణించారు.
