బంగారం అంటే భారతీయులకు ఎంతో సెంటిమెంట్. పండగైనా, శుభకార్యమైన బంగారం కొనాల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే 2026లో బంగారం ధరలు తగ్గుతాయని చాలా మంది ఆశతో ఎదురుచూస్తున్నారు.అయితే ఈ వార్త మీకు షాకింగ్ గురిచేయవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ J.P. మోర్గాన్ బంగారం ధరలపై సంచలన నివేదికను విడుదల చేసింది. ఇప్పుడు కనిపిస్తున్న ధరల పెరుగుదల కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన గోల్డ్ రష్ ముందుందని స్పష్టం చేసింది.
2026 నాటికి ఊహించని పెరుగుదల..
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర సుమారు 5,200 డాలర్ల వద్ద ఉంది. అయితే మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వల్ల ఇది ఏకంగా 6,300 డాలర్లకు మార్కును చేరుకుంటుందని జె.పి. మోర్గాన్ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే.. దాని ప్రభావం భారత్‌పై భారీగా ఉంటుంది. ప్రస్తుతం ఒక సావరిన్ (8 గ్రాములు) బంగారం ధర రూ. 1,19,360 పలుకుతుండగా, జేపీ మోర్గాన్ అంచనాల ప్రకారం.. భవిష్యత్తులో మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 2 లక్షలకు చేరే ప్రమాదం ఉంది. అంటే ఒక గ్రాము బంగారం కొనడానికి కూడా సామాన్యులు వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు బంగారం వైపు పెట్టుబడిదారులను మళ్లిస్తున్నాయి. యుద్ధ వాతావరణం, ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది శుభవార్త అయినప్పటికీ, ఆభరణాల కోసం కొనేవారికి ఇది భారమే. ధరలు తగ్గుతాయని ఆశించి వేచి చూస్తే, మున్ముందు మరింత ఎక్కువ ధరకు కొనాల్సి రావచ్చు. అందుకే బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
