తాజావార్తలు

WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన


WPL 2026 Final Winner :వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మంధాన సేన ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆఖరి నిమిషం వరకు విజయం ఇరుపక్షాల మధ్య దోబూచులాడినా, బెంగళూరు బ్యాటర్ల ధైర్యం ముందు ఢిల్లీ బౌలర్లు తలవంచక తప్పలేదు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఓపెనర్లు లిజెల్ లీ (37), షెఫాలీ వర్మ (20) మంచి ఆరంభాన్ని ఇవ్వగా, కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ (57) కప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఆమెకు తోడుగా లారా వోల్వార్డ్ (44), చివర్లో చినెల్ హెన్రీ (15 బంతుల్లో 35*) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 203/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి తొమ్మిది పరుగులకే గ్రేస్ హారిస్ వికెట్ కోల్పోయి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కెప్టెన్ స్మృతి మంధాన (87), జార్జియా వోల్ (79) మైదానంలో పూనకం వచ్చినట్లు ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మంధాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, డబ్ల్యూపీఎల్ ఫైనల్స్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించుకుంది.

విజయం దిశగా సాగుతున్న ఆర్‌సీబీకి చివరి ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. జార్జియా వోల్, రిచా ఘోష్, చివరలో కెప్టెన్ మంధాన 19వ ఓవర్లో అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో బెంగళూరు గెలుపుకు 10 పరుగులు అవసరమైన దశలో, ఢిల్లీ బౌలర్లు ఒత్తిడి పెంచారు. అయితే ఆర్‌సీబీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సంయమనంతో ఆడి ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో వరుసగా రెండో ఏడాది ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలవగా, ఢిల్లీకి మళ్ళీ రన్నరప్ నిరాశే మిగిలింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *