మూవీ రివ్యూ: విష్ణు విన్యాసం
నటీనటులు: శ్రీవిష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, గోపరాజు రమణ తదితరులు.
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
దర్శకుడు: యదునాథ్ మారుతి రావు
నిర్మాత: సుమంత్ నాయుడు జి
కథ:
విష్ణు (శ్రీవిష్ణు) ఓ కాలేజీలో జూనియర్ లెక్చరర్. జాతకాలు అంటే పిచ్చి.. మూడ నమ్మకాల్లోనే బతికేస్తుంటాడు. అదే కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుంటుంది మనీషా (నయన సారిక). పదేళ్లుగా ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా మనీషాకు పెళ్లి కాదు.. వచ్చిన వాళ్లంతా పారిపోతుంటారు. అలాంటిది పరిచయమైన మొదటి రోజే విష్ణుకు ఐ లవ్ యూ చెప్పేస్తుంది మనీషా. ఆమె విభిన్నమైన వ్యక్తిత్వం విష్ణుని ఆకర్షిస్తుంది. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడతారు. అంతా సాఫీగా సాగి పెళ్లి పీటల దాకా వెళ్లే సమయంలో.. మనీషా చెప్పిన ఓ విషయంతో ఒక్కసారిగా జాతకం తలకిందులైపోతుంది. అసలు మనీషా ఏం చెప్పింది..? ఆమె ఆ విషయం చెప్పాక విష్ణు ఏం చేసాడు..? ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..
కథనం:
శ్రీ విష్ణు సినిమా అంటే కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు.. ఉన్నందాంట్లోనే కామెడీ ఉంటే చాలు అనుకోవాలి. ప్రతీసారి అదే చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు కూడా ఇదే మ్యాజిక్ చేయాలని వచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో శ్రీవిష్ణు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. కొన్ని చోట్ల ఫన్ బాగా వర్కౌట్ అయింది. కానీ ఎఫర్ట్ లెస్‌గా చేయాలనే ప్రయత్నంలో కొన్ని సీన్స్‌లో కొంచెం ఓవర్‌గా, రొటీన్‌గానూ అనిపించాడు. హీరోయిన్ నయన సారికకు మంచి పాత్ర దక్కింది. తన క్యారెక్టర్‌లో కాన్ఫిడెంట్‌గా, చాలా అందంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్టుగా వెళ్లిపోయింది. కథ ఏం లేకపోయినా కూడా చిన్న చిన్న మూవెంట్స్‌తో అల్లుకున్నాడు దర్శకుడు మారుతిరావు. కామెడీ ఎపిసోడ్స్ బాగా పేలాయి. ముఖ్యంగా శ్రీవిష్ణు, సత్య కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్. కాకపోతే సెకండ్ హాఫ్ తేలిపోయింది. ఇంటర్వెల్‌లో ట్విస్ట్ రివీల్ అయ్యాక సెకండాఫ్ అంత బలంగా సాగలేదు. బలమైన ఎమోషన్స్ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు.. హీరోయిన్ పాత్రను కాస్త డిఫరెంట్‌గా రాసుకుని, శ్రీవిష్ణు – సత్యల కామెడీ టైమింగ్‌తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు.
ఆడియన్స్‌ను ఎలాగైనా నవ్వించాలన్న దర్శకుడి తాపత్రయం ఫస్ట్ హాఫ్‌లో కొంతవరకు వర్కౌట్ అయింది. కానీ ఐదారుగురు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా, కేవలం హీరో చుట్టూనే కామెడీని తిప్పడం మైనస్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఎలాంటి బోర్ లేకుండా డీసెంట్ కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే సినిమా రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే 30 నిమిషాల డ్రామా ఏమాత్రం ఆసక్తికరంగా లేదు, సరైన ఎమోషనల్ డెప్త్ లోపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ ముందే ఊహించేలా ఉండటంతో పాటు, దాన్ని చాలా సింపుల్‌గా హడావిడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ రైటింగ్, ఎగ్జిక్యూషన్ మీద మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. కొత్త దర్శకుల నుంచి ఆడియన్స్ కనీసం కొత్త క్యారెక్టరైజేషన్స్ ఆశిస్తారు. కానీ ఇందులో ఓ సీక్వెన్స్ అంతా వెంకీ సినిమా నుంచి తీసుకున్నారు. వెంకీలోని ‘జగదాంబ చౌదరి’ క్యారెక్టర్‌ను వాడేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం 2 గంటల రన్‌టైమ్ ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ రిపీట్ అవ్వడంతో సినిమా
స్లో ఫీల్ కలుగుతుంది.
నటీనటులు:
శ్రీ విష్ణు సినిమాకు బలం.. సింపుల్ కథను కూడా మోసాడు ఈ హీరో. చాలా చోట్ల ఈయన డైలాగ్స్ నవ్వు తెప్పించాయి. ఏం లేని చోట కూడా దూరిపోయి కామెడీ చేసాడు. అది ఆయన ప్లస్.. సినిమాకు కూడా అదే ప్లస్ అయింది. నయన్ సారిక స్క్రీన్ మీద చాలా బాగుంది. సత్య మరోసారి అదిరిపోయే కామెడీ చేసాడు. ఉన్నంతలో నవ్వించాడు. మిగిలిన వాళ్లలో బ్రహ్మాజీ, ప్రవీణ్ జస్ట్ ఓకే.. మురళీ శర్మ చిన్న పాత్రలో మెరిసాడు.. శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, గోపరాజు రమణ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
రధన్ సంగీతం అయితే పూర్తిగా నిరాశపరిచింది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రొటీన్‌గానే ఉంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ ప్లస్. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉన్నాయి. కార్తికేయన్ రోహిణి ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాను రెండు గంటల క్రిస్ప్ రన్‌టైమ్‌తో కట్ చేసినా.. కొన్ని సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా డీసెంట్‌గా ఉన్నాయి. దర్శకుడు యధునాధ్ మారుతి రావు పూర్తిగా బాల్ తీసుకెళ్లి శ్రీ విష్ణు చేతిలో పెట్టేసాడు.. సెకండాఫ్ బాగా రాసుకుని ఉండుంటే సినిమా రేంజ్ పెరిగేది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా విష్ణు విన్యాసం.. అక్కడక్కడా కామెడీ విన్యాసం..!
