T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 27) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్‌కు అనూహ్యంగా లైన్ క్లియర్ అయ్యింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు సూపర్-8లో వరుసగా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ గెలుపుతో ఇప్పుడు రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య నెట్ రన్ రేట్ వార్ మొదలైంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌లు ఆడి 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ +1.390గా ఉంది. మరోవైపు పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్క పాయింట్ (రన్ రేట్ -0.461)తో మూడో స్థానంలో ఉంది. అయితే, పాకిస్థాన్‌కు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండటమే వారికి కలిసి వచ్చే అంశం. శనివారం (ఫిబ్రవరి 28) పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాక్ గెలిస్తే, వారి పాయింట్లు కూడా 3కి చేరుతాయి. అప్పుడు ఎవరి రన్ రేట్ బాగుంటే వారే సెమీస్‌కు వెళ్తారు.
పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లాలంటే శ్రీలంకపై కేవలం గెలిస్తే సరిపోదు, ఒక భారీ విజయం నమోదు చేయాలి. సల్మాన్ ఆగా సేన ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేస్తే శ్రీలంకపై కనీసం 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తే, శ్రీలంక విధించిన లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే ఛేదించాలి. ఈ సమీకరణం పూర్తయితేనే పాకిస్థాన్ రన్ రేట్ న్యూజిలాండ్ కంటే మెరుగవుతుంది. ముఖ్యంగా శ్రీలంకను 100 పరుగుల లోపే కట్టడి చేస్తే పాక్‌కు పని మరింత సులభమవుతుంది.
శనివారం పల్లెకెలెలో వాతావరణం కూడా పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంది. వర్షం పడే సూచనలు ఏమాత్రం లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉన్నా, పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉండటం పాక్‌కు ప్లస్ పాయింట్. ఇప్పటికే జింబాబ్వే, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతిలో వరుస ఓటములతో శ్రీలంక కుంగిపోయి ఉంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని పాక్ చెలరేగిపోతే సెమీస్ బెర్త్ ఖాయం. ఒకవేళ ఈ భారీ తేడాతో గెలవలేకపోతే మాత్రం న్యూజిలాండ్ నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. పాక్ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా వారి చేతుల్లోనే ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
